* కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
* వేములవాడలో ఎన్నికల ప్రచారం
* కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు
* తల్లిలాంటి పార్టీకి కష్టమొచ్చిందని వెల్లడి
ఆకేరు న్యూస్, వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మనకు పోటీనే కాదన్నారు. పార్టీ కండువా లేకుంటే అతడు కాంగ్రెస్ అభ్యర్థి అని ఎవరూ గుర్తించరని ఎద్దేవా చేశారు. ఎంపీగా కరీంనగర్ కు బండి సంజయ్ చేసిన మంచి పని ఒక్కటీ లేదని విమర్శించారు. తల్లిలాంటి పార్టీ బీఆర్ ఎస్ కు కష్టం వచ్చిందని, సర్వశక్తులూ ఒడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు. ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉందని ఈ ఎన్నికల్లో నిరూపించాలన్నారు. ఏడాదిలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితికి మళ్లీ కేసీఆర్ వస్తారని తెలిపారు. కార్యకర్తల మీద ఈగవాలినా, అర్ధరాత్రయినా, అపరాత్రయినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ ఎస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఉండాలంటే గులాబీ జెండా అండగా ఉండాలని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంపై చర్చ లేవనెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి మండలం, ప్రతి గ్రామం ప్రచారానికి వస్తానని తెలిపారు.
————–