* జీవన్ రెడ్డి పార్టీని ఎందుకు వీడుతున్నారు.
* ఈ నెల 25న భవిష్యత్తు కార్యాచరణ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం కొనసాగింది. మంత్రులు, సీనియర్ నేతలు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక లేఖ విడుదల చేశారు..
* జీవన్ రెడ్డి పార్టీని ఎందుకు వీడుతున్నారు.. ఏం జరిగింది.?
జీవన్ రెడ్డి చిరకాల ప్రత్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తోంది. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో 7,828 ఓట్ల తేడాతో సంజయ్ ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సంజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 61,185 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2023 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కాగా 2024 జూన్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దీంతో ఒక్కసారిగా జగిత్యాల రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనప్పటికీ జగిత్యాలలో మాట చెల్లు బాటు కాకుండా పోయింది. అన్నీ తానై అన్నట్లు సంజయ్ ప్రవర్తిస్తున్నారని వాపోయారు. అసలు నేను అధికార పార్టీలో ఉన్నానా..? లేనా అన్న అనుమానాలను జీవన్ రెడ్డి వ్యక్తం చేసేవారు. ఒక విధంగా తనను పొమ్మన లేక పొగ బెడుతన్నట్లు అర్థమవుతోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసే వాడు..
* పార్టీలో కొనసాగలేను
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న తాను 20 నెలలుగా తీవ్రంగా అవమానాలు భరిస్తున్నాను. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. ఇంకాలం తనతో కలిసి ప్రయాణించిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ పరిస్థితులను గమనిస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు . ఇంతటి మానసిక క్షోభతో పార్టీలో కొనసాలేనన్న ఆయన ఈనెల 25న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అదే రోజు జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసే సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై సలహాలు, సూచనలు ఇచ్చి మానసిక స్తైర్యం కల్పించి అండగా నిలవాలని కోరారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
* మంత్రులు బుజ్జగించినా..
దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తనకు అధిష్టానం గుర్తింపు ఇవ్వకపోగా.. అవమానానికి గురిచేసిందని మానసిక వేధనకు గురైన జీవన్‌రెడ్డిని బుజ్జగించడానికి మంత్రులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో చర్చించాక మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే జీవన్‌రెడ్డి తన అనుచరులతో ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
*నాలుగు దశాబ్దాల ప్రస్థానం
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. 1983లో టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, 1984 నుండి కాంగ్రెస్‌లో ఉంటూ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా (2004-2009) పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బలమైన నాయడిగా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డి పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను భరించలేక బయటికి వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు.
