* నిగనిగలాడే మామిడి పండ్లు కొంటున్నారా? ఆగండి
* నిగనిగలాడే మామిడి పండ్ల వెనుక ‘విషపు కోరలు’.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
*కాల్షియం కార్బైడ్ మామిడి అమ్మితే కఠిన చర్యలు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్:వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్ లో పండ్ల రారాజు మామిడి సందడి మొదలవుతుంది. అయితే, ఈ తీయని పండ్ల వెనుక ప్రాణాంతకమైన విషం దాగి ఉందన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదని హైదరాబాద్ పోలీసు విభాగం హెచ్చరిస్తోంది. సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కొందరు వ్యాపారులు స్వార్థం కోసం మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్నారు.
* కృత్రిమంగా ఎలా మగ్గిస్తున్నారు?
సహజంగా చెట్టుపై పండాల్సిన మామిడి కాయలను, త్వరగా పండించడం కోసం ‘కాల్షియం కార్బైడ్’ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి పండుకు తళతళలాడే పసుపు రంగును ఇస్తాయి. రోడ్డు పక్కన బండ్ల మీద అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండు నాణ్యమైనది కాదని, అది మీ అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
* అసలైన పండును గుర్తించడం ఎలా?
సహజంగా పండిన పండు మొత్తం ఒకే రంగులో ఉండదు. కానీ రసాయనాలతో మగ్గించిన పండు పైన పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. సహజమైన పండ్లకు మంచి సువాసన ఉంటుంది. కల్తీ పండ్లకు రసాయన వాసన వస్తుంది. కృత్రిమంగా పండిన పండ్లు అంత తియ్యగా ఉండవు, కొన్నిసార్లు గొంతులో మంట పుట్టిస్తాయి. సహజంగా పండిన పండు నీటిలో వేస్తే మునుగుతుంది. కార్బైడ్ వేసినవి తేలుతాయి.
* ఆరోగ్య సమస్యలు:
కార్బైడ్ ఉపయోగించిన పండ్లు తింటే తక్షణమే గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇవి నాడీ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, శ్వాసకోశ ఇబ్బందులకు కూడా దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
* పోలీసుల నిఘా – ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST):
ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST) పేరుతో కల్తీ పదార్థాల గుట్టు రట్టు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీకు ఎక్కడైనా కల్తీ మామిడి పండ్ల విక్రయం లేదా కృత్రిమంగా మగ్గబెట్టే కేంద్రాల సమాచారం తెలిస్తే వెంటనే డైల్ 100 కి గానీ, లేదా హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్: 8712661212 కి గానీ సమాచారం అందించండి.
