* మందుబాబుల ఆట కట్టించిన ఎస్సై
ఆకేరు న్యూస్, గోదావరిఖని: మందు బాబుల ముందస్తు వ్యూహం బెడిసి కొట్టింది. సోషల్ మీడియాను వాడుకుని లిక్కర్ బాబులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పెద్ద ప్లానే వేశారు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఒక వాట్సాప్ నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ట్రాఫిక్ ఎస్పై ఎంట్రీతో మందు బాబుల ముందస్తు వ్యూహం బెడిసి కొట్టింది.
* మందుబాబుల పోలీస్ మామలు గ్రూప్
గోదావరిఖని పట్టణంలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు? ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు? ఏ రూట్లో వెళ్తే సేఫ్? ఏ రూట్లో వెళ్ళ కూడదన్న వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి “పోలీస్ మామల స్క్వాడ్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఇందులో ఏకంగా 1024 మంది సభ్యులు ఉండటం గమనార్హం. ఒకచోట తనిఖీలు జరుగుతుంటే వెంటనే గ్రూప్‌లో అలెర్ట్ పంపి అందరినీ అప్రమత్తం చేయడమే వీరి లక్ష్యం .
* ఎస్సై ఎంట్రీతో సీన్ రివర్స్
గోదావరి పట్టణంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఒక యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అనుమానం వచ్చి అతని ఫోన్ తనిఖీ చేయగా ఈ గ్రూప్ గుట్టు రట్టయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అదే యువకుడి ఫోన్ ద్వారా గ్రూప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎస్సై గ్రూప్‌లోకి రాగానే సభ్యులు ఒక్కొక్కరుగా ఎగ్జిట్ అవ్వడం మొదలుపెట్టారు.
అయితే అప్పటికే ఎస్సై ఒక సెల్ఫీ వీడియో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేశారు. “ఏం మామలూ.. బాగున్నారా? మీ నంబర్లు అన్నీ నా దగ్గర సేవ్ అయి ఉన్నాయి. గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి!” అంటూ ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన గ్రూప్ సభ్యులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తప్పు చేసి తప్పించుకోవాలనుకున్న యువకులకు పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారని స్థానికులు అంటున్నారు..
——————————-
