ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూర్ పరిధిలోని రాములపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు ఎంపికయ్యాడు. ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసినప్పటికీ, చిన్నప్పటి నుండి నటనపై ఉన్న మక్కువతో 2020 కరోనా సమయంలో బిత్తిరి రాజు క్రియేషన్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన సొంత శైలిలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన 70 ఏళ్ల నాయనమ్మ సూపర్ సురవ్వ తో కలిసి చేసిన కామెడీ వీడియోలు సోషల్ మీడియాలో ఆదరణ పొందాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజు, తన సహజసిద్ధమైన నటనతో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన జబర్దస్త్ షోలో అవకాశం దక్కడం విశేషం. రాజు సాధించిన ఈ విజయంపై అతని తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

