Warangal handloom crisis
*నేతన్నల గుండెకోత.. ఆర్డర్లు రద్దు చేసిన సర్కార్
*ఆగిపోయిన మగ్గం.. ఆకలి కేకలు
*టెండర్ల పేరుతో చేనేతకు ఉరి..
*ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత సంక్షోభం
ఆకేరు న్యూస్, వరంగల్: ‘రెక్కాడితే గానీ డొక్కాడని’ చేనేత కార్మికుల బతుకులపై విద్యార్థుల యూనిఫాం ఆర్డర్ల రద్దు పిడుగులా పడింది. ప్రతి ఏటా జనవరి మాసంలోనే వచ్చే ఆర్డర్ల కోసం ఎదురుచూసే నేతన్నలకు, ఈసారి ప్రభుత్వం నుంచి వచ్చిన షాక్ కోలుకోలేని విధంగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన ఆర్డర్లను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేస్తూ, ఓపెన్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించడంతో చేనేత సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
*నిలిచిపోయిన మగ్గాలు – అప్పుల ఊబిలో కార్మికులు…
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శాయంపేట వంటి ప్రాంతాల్లో చేనేత సహకార సంఘాలు ఇప్పటికే ముడి సరుకు, రంగులు కొనుగోలు చేసి పని ప్రారంభించాయి. సగం తయారైన వస్త్రాలు మగ్గాలపైనే ఉండగా, ప్రభుత్వం ఆర్డర్లను రద్దు చేయడంతో నేతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. “ముందుగా ఆర్డర్లు ఇచ్చి, ఇప్పుడు వద్దనడం వల్ల తాము చేసిన ఖర్చు అంతా అప్పులుగా మారిపోతుందని” కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*అయోమయంలో సంఘాల పాలన..
గత కొన్నేళ్లుగా చేనేత సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడంతో, అవి ప్రత్యేక అధికారుల చేతుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్కో (TESCO) ద్వారా వచ్చే ఆర్డర్లు కూడా నిలిచిపోవడంతో సంఘాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56 సంఘాలు ఉండగా, వాటిపై ఆధారపడ్డ 10 వేల మంది కార్మికుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
*ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న నేతలు…
“చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ కొత్త టెండర్ల విధానాన్ని తీసుకొచ్చింది” అని మాజీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన రూ. 105 కోట్ల విలువైన యూనిఫాం ఆర్డర్లను తక్షణమే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
