Kavitha Bandi Bhagirath Lookout Notice
*బండి సంజయ్ కుమారుడిపై ‘లుక్ అవుట్’ నోటీసులివ్వండి..
*దేశం వదిలి వెళ్లే ఛాన్స్ ఉంది…
*బండి భగీరథ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. భగీరథ్‌పై నమోదైన గంభీరమైన ఆరోపణల నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని, తక్షణమే తెలంగాణ పోలీసులు ఆయనపై ‘లుక్ అవుట్ నోటీసులు’ జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరారు.
*పారిపోయే అవకాశం ఉంది…
కేంద్ర మంత్రి పదవిలో ఉన్న తండ్రి పలుకుబడిని ఉపయోగించి, కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి భగీరథ్ విదేశాలకు వెళ్లే ప్రమాదం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితుడు ఎంతటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తైనా సరే, విచారణకు సహకరించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించి, ఆయన విదేశీ ప్రయాణాలను నిరోధించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
*కఠిన చర్యలు తీసుకోవాలి…
“సమాజంలోని మహిళలకు రక్షణ వ్యవస్థపై నమ్మకం కలగాలంటే, ఇలాంటి కీలక కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి” అని కవిత పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరగడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
*రాజకీయ వర్గాల్లో చర్చ…
ఈ డిమాండ్‌తో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కాక రేగింది. అనవసరమైన ప్రచారాలు పక్కన పెట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన స్పష్టం చేస్తోంది. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి అడుగులు వేస్తారో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
