Additional Collector Hospital Price List Rules
* తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
– అదనపు కలెక్టర్ ఎన్. రవి
ఆకేరు న్యూస్ , హనుమకొండ:
ఆస్పత్రుల్లో రోగులకు అందించే సేవలకు సంబందించిన ధరల పట్టికను తప్పినిసరిగా ప్రదర్శించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అన్నారు. ప్రైవేట్ క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రులు ‘తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం’ లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన అధ్యక్షతన ‘జిల్లా రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో రోగులకు అందించే వివిధ వైద్య సేవలు, నిర్వహించే ల్యాబ్ పరీక్షలు, వాటికి వసూలు చేసే రుసుముల వివరాలతో కూడిన ధరల పట్టిక (Price List) ను ఏర్పాటు చేయాలి. రోగులు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఉండే స్థలంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, నమ్మకమైన వైద్య సేవలు అందించేందుకు ఇది అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
* రోగుల భద్రత – ప్రమాణాల అమలు
ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలతో పాటు, ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రోగుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వైద్య నిబంధనల ప్రకారం అన్ని ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కాగా ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీలు, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యల వివరాలను కమిటీ సభ్యులకు నివేదించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 780 ప్రైవేట్ క్లినిక్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, 118 ప్రభుత్వ డిస్పెన్సరీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు (UPHC) చట్టం పరిధిలో నమోదు చేయబడినట్లు డీఎంహెచ్ఓ వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధి డాక్టర్ ముక్క దిలీప్ కుమార్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, జిల్లా స్టాటిస్టికల్ అధికారి జి. ప్రసన్నకుమార్, డెమో (DEMO) వి. అశోక్ రెడ్డి, సురేఖ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
——————————
