Collector Chahat Bajpai Inspection EGS Works
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ(ఈజీఎస్) పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం శనిగరం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డును, గ్రామంలో వ్యర్థాల నిర్వహణ, చెత్త వేరు చేసే విధానం, కంపోస్టు తయారీ ప్రక్రియ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఉప్పల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు కల్పిస్తున్న వసతులు, రోజువారీ హాజరు, యాప్లో అటెండెన్స్ ఫోటోలు తీసేటప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళా కూలీలతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు.
శుక్రవారం పనులకు 480 పైగా మంది కూలీలు హాజరుకావడం, పని ప్రదేశంలో కూలీల కోసం ఏర్పాటు చేసిన తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల వంటి సౌకర్యాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్ఐ ట్యాంక్ పనులను పరిశీలించిన ఆమె, పనులు వేగంగా జరుగుతుండడంతో డిఆర్డిఓ మేన శీను, కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, ఈజీఎస్ సిబ్బందిని అభినందించారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమ,ఉప సర్పంచ్ సిద్ధార్థ, ఎమ్మార్వో సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
