Saidabad Success School Controversy
* రంగంలోకి విద్యాశాఖ అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న ‘సక్సెస్ స్కూల్’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మతపరమైన బోధనలు చేస్తోందన్న ఆరోపణలు నగరంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఒక విద్యార్థికి ‘కల్మా’ చదవాలని, ‘ఖురాన్’ నేర్చుకోవాలని ఉపాధ్యాయులు హోంవర్క్ ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది.
* తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి..
పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఇంటికి వెళ్లిన తర్వాత.. తనకు ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ గురించి తండ్రికి తెలిపాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్లో ఇలా ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన బోధనలు చేయడంపై సదరు విద్యార్థి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఆయన స్థానిక హిందూ సంఘాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు విద్యాశాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.
* హిందూ సంఘాల ముట్టడి, పోలీసుల రంగప్రవేశం…
ఈ ఉదంతం బయటకు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌ను ముట్టడించేందుకు తరలివచ్చారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి, ఆందోళనకారులను అడ్డుకున్నారు. పాఠశాల ముట్టడికి యత్నించిన పలువురు హిందూ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి చేయి దాటకుండా స్కూల్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
* టీచర్ సస్పెన్షన్ – విద్యాశాఖ తనిఖీలు..
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సక్సెస్ స్కూల్‌కు చేరుకుని ముమ్మర తనిఖీలు చేపట్టారు. విద్యార్థి తండ్రి ఇచ్చిన లిఖితపూర్వక స్టేట్మెంట్ను, ఆధారాలను విద్యాశాఖ అధికారులు స్కూల్ మేనేజ్మెంట్కు చూపించి నిలదీశారు.
దీనిపై స్పందించిన స్కూల్ మేనేజ్మెంట్.. సదరు విద్యార్థికి ఆ హోంవర్క్ ఇచ్చింది నిజమేనని అంగీకరిస్తూ, బాధ్యురాలైన మహిళా టీచర్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. భవిష్యత్తులో పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు చేయబోమని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని మేనేజ్మెంట్ అధికారులకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు.
