Kriti Sanon reacts to Kangana Ranaut's comments
* కంగనా రనౌత్‌పై కృతి సనన్ కౌంటర్
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
రాఖీ పండుగ సందర్భంగా రూపొందించిన ఓ జ్యువెలరీ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై కంగనా రనౌత్ చేసిన విమర్శలకు నటి కృతి సనన్ ఘాటుగా స్పందించారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో సమాజం తరచూ తీర్పులు ఇవ్వడంపై ఆమె ప్రశ్నలు సంధించారు.
* సంస్కృతి, సంప్రదాయాలు హృదయంలో ఉంటాయి
కృతి సనన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో.. ‘‘మహిళలు ఏం ధరించాలో చెప్పడం మనం ఎప్పుడు ఆపుతాం?’’ అని ప్రశ్నించారు. కాలానుగుణంగా సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఓ మహిళ తన సంస్కృతిని ఎంతగా గౌరవిస్తుందో కేవలం ఆమె దుస్తులను బట్టి నిర్ణయించడం సరికాదని అన్నారు. ‘‘సంస్కృతి, సంప్రదాయాలు ఆమె హృదయంలో ఉంటాయి.. ఆమె ధరించే దుస్తుల్లో, ముఖ్యంగా నెక్‌లైన్‌లో కాదు’’ అంటూ కృతి ఘాటుగా వ్యాఖ్యానించారు.
* అక్కాచెల్లెళ్లుగా ఒకరికొకరు రాఖీ
సాధారణంగా రాఖీ పండుగ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. అయితే కృతి సనన్ తన సోదరితో కలిసి ఈ పండుగను భిన్నంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘రక్షాబంధన్ అంటే రక్షణకు సంబంధించిన బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎంతగా రక్షించగలడో మేమూ ఒకరినొకరం అంతే రక్షించుకోగలమని మాకు తెలుసు. ’’ అని కృతి తెలిపారు.
* అసలు వివాదం ఏమిటి?
రాఖీ పండుగను పురస్కరించుకుని రూపొందించిన ఓ జ్యువెలరీ ప్రకటనలో కృతి సనన్ బ్రాలెట్ తరహా బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సంప్రదాయ పండుగకు ఈ తరహా పాశ్చాత్య దుస్తులను ఉపయోగించడంపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు.‘‘ మీ సోదరుడికి బికినీ లేదా లోదుస్తుల తరహా దుస్తుల్లో రాఖీ ఎందుకు కట్టాలి? మీ స్టైలింగ్ ఆప్షన్స్ అన్నీ ఏమయ్యాయి? ఈ ప్రకటన కావాలనే అసౌకర్యంగా అనిపించేలా రూపొందించినట్లుగా ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
