Rashmika Mandanna praises Irumudi Movie
* ఇరుముడిపై రష్మిక మందన్న ప్రశంసలు..
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’పై నటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనను ఊహించని విధంగా భావోద్వేగానికి గురిచేసిందని ఆమె తెలిపారు. చర్చించాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని చిత్రబృందం ఎంతో అందంగా తెరకెక్కించిందని ప్రశంసించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ సినిమాను కొనియాడుతూ పోస్ట్ చేశారు.
* ఎంత అందమైన సినిమా ఇది
ఇంకా ‘‘నిన్న ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం వచ్చింది. ఎంత అందమైన సినిమా ఇది. నేను ఊహించని విధంగా ఈ చిత్రం నన్ను తాకింది. సాధారణంగా చిన్న పట్టణాల్లో పెరిగేటప్పుడు మనకు ఏదైనా జరిగితే లేదా ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పెద్దలకు చెప్పాలని అనుకుంటాం. ఎందుకంటే మనలో ఉండే అమాయకత్వం అలాంటిది. కానీ ఆ తర్వాత వాస్తవం మనకు ఎదురవుతుంది. ఏం జరిగినా మౌనంగా ఉండాలని చెబుతారు’’ అని పేర్కొన్నారు. సినిమాతో పాటు నటీనటులు, చిత్రబృందంపై కూడా రష్మిక ప్రశంసలు కురిపించారు. ‘ఇరుముడి’ తనకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్గా అనిపించిందని, మాట్లాడాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమా ప్రస్తావించిందని తెలిపారు.
* ఆమె సూర్యకాంతిలా కనిపించింది..
రవితేజను అభినందిస్తూ.. ‘‘ఈ విజయానికి మీపై నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని రష్మిక పేర్కొన్నారు. బాలనటి నక్షత్రను ప్రశంసిస్తూ.. సినిమాలో ఆమె సూర్యకాంతిలా కనిపించిందని, ఆమె చిరునవ్వు తనను కూడా నవ్వించిందని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణను కూడా అభినందించిన రష్మిక.. ఆయన ఈ విజయానికి పూర్తిగా అర్హుడని పేర్కొన్నారు. ఇలాంటి అందమైన చిత్రాన్ని అందించినందుకు మొత్తం చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
