Nepal Floods 105 Indians Missing
* నేపాల్లో వరద విలయం
* ఆకస్మిక వరదకు కారణాలు తేలాల్సి ఉంది..
ఆకేరు న్యూస్, డెస్క్:
నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. రసువా జిల్లాలోని భోటేకోశీ నదిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉప్పెనలా వరద ఉధృతి పెరగడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. టిబెట్ వైపు నుంచి అపారంగా నీరు వచ్చి చేరడంతో నదీ పరీవాహక ప్రాంతాలైన తిమురే, స్యాఫ్రుబేసి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ధాటికి వందలాది ఇళ్లు, ముఖ్యమైన రహదారులు, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక జల విద్యుత్ (హైడ్రోపవర్) ప్రాజెక్టులతో పాటు విద్యుత్ మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
* వందలాది మంది గల్లంతు..
ఈ ఊహించని విపత్తులో ఇప్పటివరకు మొత్తం 384 మంది ప్రయాణికులు వరద నీటిలో గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు (NRIలు), 93 మంది నేపాల్ స్థానికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారిలో స్థానిక భద్రతా సిబ్బంది కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
* యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ సైన్యం, పోలీసులు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (APF) దళాలు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించాయి. దుర్గమ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వివిధ ట్రావెల్ ఏజెన్సీలు, స్థానిక యంత్రాంగం, భద్రతా బలగాలు కలిసి గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
* పరీవాహక జిల్లాల్లో ‘హై అలర్ట్’..
భోటేకోశీ నది దిగువకు ప్రవహించి త్రిశూలీ నదిలో కలుస్తుండడంతో నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ తదితర పరీవాహక జిల్లాల అధికారులను ప్రభుత్వం తీవ్రంగా అప్రమత్తం చేసింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నది వైపు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
* వరదకు గల కారణాలు..
ఈ ఆకస్మిక ఉధృతి కచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని ఒక అంచనా. అయితే, గతంలోనూ ఇదే భోటేకోశీ నది పరీవాహకంలోని హిమనాద సరస్సు (Glacial Lake) అకస్మాత్తుగా బద్దలై నీరు విడుదల కావడంతో తీవ్ర వినాశనం జరిగింది. తాజా ఘటన వెనుక కూడా అలాంటి ‘గ్లేషియల్ లేక్ అవుట్ బార్ట్స్’ ఏమైనా ఉందా ? అనే కోణంలో వాతావరణ నిపుణులు, అధికారులు పరిశీలిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
