Harish Rao Arrest Hanamkonda
* హరీశ్ రావు అరెస్ట్
ఆకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం బీఆర్ఎస్ నేతలు అక్కడ నుండి తిరిగి వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తు అరెస్ట్ చేశారు. హరీశ్ రావుతో పాటు సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్ మరియు ఇతర స్థానిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు.
ముఖ్య నేతల అరెస్ట్‌తో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.
ఈ హఠాత్ పరిణామంతో కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
