Fertilizer Booking App Farmer
* ఎరువుల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఎరువుల కొనుగోలు కోసం అమల్లోకి తెచ్చిన ప్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS) యాప్ అన్నదాతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. యాప్ గురించి రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు.
* సాఫ్ట్వేర్ లోపాలు , క్యాన్సిలేషన్ల తిప్పలు
రైతులు యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న తర్వాత దుకాణానికి స్వయంగా వెళ్లలేని పరిస్థితుల్లో వారి తరఫున మరొకరిని (Representative) పంపించేందుకు యాప్‌లో ప్రత్యేకంగా ‘Others’ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌ను ఉపయోగించి అసలు భూమి పట్టాదారు స్థానంలో వేరే వ్యక్తి ఆధార్ , ఫోన్ నంబరు వివరాలు నమోదు చేసి బుకింగ్ చేసినప్పటికీ, సదరు వ్యక్తి దుకాణానికి వెళ్తే డీలర్లు యూరియా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా యూరియా ఇవ్వడం కుదరదని షాప్ నిర్వాహకులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, అప్పటికే చేసిన బుకింగ్‌ను రద్దు (Cancel) చేసుకుని, తిరిగి పట్టాదారు పేరు మీదనే మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుండటంతో ఎరువుల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
* కత్తి మీద సాములా మారిన రెండు రోజుల గడువు
ఈ డిజిటల్ యూరియా బుకింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు ఆ తర్వాత ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. గ్రామాల్లో అన్ని వేళలా ప్రయాణ సౌకర్యాలు దొరకకపోవడం, సొంత వాహనాలు లేకపోవడం, రైతన్నలు పనుల ఒత్తిడి మధ్య నిర్ణీత గడువులోగా దుకాణాలకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవడం రైతన్నలకు కత్తి మీద సాములా మారింది.
* క్లిష్ణంగా ఓటీపీ – బిల్లింగ్ ప్రక్రియ
ఆప్‌లో బుకింగ్ అయిన యూరియాకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించుకోవాలి. ఆ తర్వాత రైతు ఆధార్ నంబర్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీని తరువాత ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) కోసం సెల్ ఫోన్లను, లేదా సదరు పట్టాదారుకు ఫోన్లు చేస్తూ నిరీక్షించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే యూరియా కోసం చాలామంది ఒకే స్కానర్ వద్ద ఉండడంతో ఓటీపీ చెప్పకపోతే మరోసారి రైతన్న లైన్లో నిరీక్షించి మరోసారి ప్రయత్నించాల్సి వస్తుంది. ఓటీపీ అందిన తర్వాత సిస్టమ్‌లో అవసరమైన యూరియా బస్తాలను బుక్ చేసి, ఆపై ఎరువుల ధరకు సంబంధించి బిల్లింగ్ పూర్తి చేస్తారు. చివరగా కొనుగోలు చేసిన యూరియా బస్తాలను వాహనాలలోకి లేదా బండ్లపైకి హమాలి ద్వారా లోడింగ్ చేయించుకోవడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
* క్యూఆర్ కోడ్ నిబంధన
మునుపు ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసుకున్నాక సదరు ఎరువుల దుకాణానికి వెళ్తే యూరియా బస్తాలు ఇచ్చేవారు. కానీ నేడు కొత్తగా వచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పటికీ, ఎరువుల దుకాణానికి వెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తేనే యూరియా, ఇతర ఎరువుల బస్తాలు ఇస్తామన్న నిబంధన రైతులను ఇబ్బంది పెడుతుంది.
* రైతన్న – మోసపోయే ప్రమాదం
సాంకేతికత రైతులకు వరంగా మారాల్సిందిపోయి, శాపంగా మారుతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం యూరియా బుకింగ్ లో ఓటీపీల కోసం వేచి చూసే సమయంలోనూ, సాంకేతిక అంశాలపై అవగాహన లోపించిన సందర్భాలలోనూ మధ్యవర్తుల ప్రమేయం వల్ల ఓటీపీ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నిరక్షరాస్యులైన రైతుల ఇబ్బందిని గుర్తించాలని, క్యూఆర్ కోడ్ నిబంధనను సరళీకృతం చేయాలని, బుకింగ్ గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
