Veera Vanitha Spirit Yatra
* ఈనెల 15న పాలకుర్తిలో వీరవనితల స్ఫూర్తి యాత్ర..
* విజయవంతం చేయాలని పిలుపు
Veera Vanitha Spirit Yatra ఆకేరు న్యూస్, పాలకుర్తి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, దానిని హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్మారక భవనంలో సోమవారం సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించింది. ముస్కు ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య మాట్లాడారు.
దోపిడీ, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం
దొరలు, భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు ఐక్యంగా సాగించిన పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని వారు అన్నారు. ఆనాడు జాగీర్దారీ, జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి కావాలనే నినాదంతో ప్రజలు పోరాడారని పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు ఈ పోరాటాన్ని హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారని వారు విమర్శించారు. ప్రజల హక్కులు, భూమి కోసం సాగిన పోరాటాన్ని మతపరమైన కోణంలోకి లాగడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్రం విఫలం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని సీపీఎం నాయకులు విమర్శించారు. సాయుధ పోరాటం పేరు చెప్పగానే పాలకుర్తి ప్రాంతం గుర్తుకు వస్తుందని, జనగామ జిల్లా వీరుల పుట్టినిల్లుగా నిలిచిందని పేర్కొన్నారు.
15న వీరవనితల స్ఫూర్తి యాత్ర
ఈనెల 15న పాలకుర్తిలోని వీరనారి ఐలమ్మ విగ్రహం ఎదుట వీరవనితల స్ఫూర్తి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జాతీయ కార్యదర్శి కానినిక గోష్, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి, రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. మహిళలు, పార్టీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సోమ సత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
