Kadiyam Srihari
* అసెంబ్లీలో ప్రభుత్వానికి కడియం శ్రీహరి విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోనే పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి ఉమ్మడి వరంగల్ రైతుల సమస్యలను తీసుకెళ్లిన కడియం శ్రీహరి.. జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు రవాణా భారం తగ్గడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
పామాయిల్ సాగుపై రైతుల ఆసక్తి
పంట మార్పిడిపై ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో వరంగల్ ప్రాంత రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగవుతున్నాయని, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
24 గంటల్లో ప్రాసెసింగ్ కీలకం
పామాయిల్ గెలలను కోసిన తర్వాత 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెసింగ్ చేయడం ముఖ్యమని కడియం శ్రీహరి చెప్పారు. ఆలస్యమైతే నూనె శాతం తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దూర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలకు పంటను తరలించాల్సి రావడంతో సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.
రైతులకు లాభం.. యువతకు ఉపాధి
వరంగల్లోనే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు రవాణా భారం తగ్గుతుందని, గెలలను త్వరగా ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా పంట నాణ్యతను కాపాడుకోవచ్చని కడియం శ్రీహరి అన్నారు. ఫ్యాక్టరీతో పాటు రవాణా, లారీలు, నిల్వ కేంద్రాలు తదితర రంగాల్లో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి
పామాయిల్ సాగు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రాసెసింగ్ వసతులపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి కోరారు. వరంగల్ జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పంటలు సాగు చేయడంతో పాటు వాటిని విక్రయించేందుకు, ప్రాసెసింగ్ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
