Waqf Lands
* 22A నుంచి ప్రైవేట్ భూములు తొలగించాలి
ఆకేరు న్యూస్, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని, పొరపాటున సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేరిన రైతులు, ప్రైవేట్ వ్యక్తుల భూములను వెంటనే తొలగించాలని ముస్లిం వక్ఫ్ ల్యాండ్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తెలంగాణ డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం అసోసియేషన్ ప్రతినిధులు హనుమకొండ జాయింట్ కలెక్టర్‌తో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు సాధారణ రైతులు, ప్రైవేట్ భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వక్ఫ్ భూములకు రీ-సర్వే
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చారిత్రక, దాతృత్వ వక్ఫ్ భూముల్లో అనేకం ధరణి, భూ భారతి భూ రికార్డుల పోర్టల్‌లో స్పష్టంగా నమోదు కాలేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రికార్డులలో స్పష్టత లేకపోవడం వల్ల విలువైన వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములపై సమగ్ర క్షేత్రస్థాయి రీ-సర్వే నిర్వహించి, అసలైన భూములను డిజిటల్ రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని కోరారు.
22A జాబితాతో రైతులకు ఇబ్బందులు
రెవెన్యూ రికార్డుల్లో జరిగిన పొరపాట్ల కారణంగా వక్ఫ్‌తో ఎలాంటి సంబంధం లేని రైతులు, ప్రైవేట్ భూ యజమానుల భూములు కూడా సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేరుతున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.
దీంతో సంబంధిత భూ యజమానులు తమ భూములను విక్రయించలేకపోవడంతో పాటు ఇతర భూ లావాదేవీలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రికార్డుల్లోని తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు.
ప్రధాన డిమాండ్లు
వరంగల్ జిల్లాలోని వక్ఫ్ భూములపై సమగ్ర క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలి.
అసలైన వక్ఫ్ భూములను ధరణి, భూ భారతి పోర్టల్‌లో సక్రమంగా నమోదు చేయాలి.
పొరపాటున 22A నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేట్ భూములను వెంటనే తొలగించాలి.
ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
వక్ఫ్, 22A భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకుని వక్ఫ్ ఆస్తులకు చట్టపరమైన రక్షణ కల్పించడంతో పాటు, 22A జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజమైన భూ యజమానులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అసోసియేషన్ నాయకులు కోరారు.
ప్రతినిధులు
వినతిపత్రం సమర్పించిన ప్రతినిధి బృందంలో ప్రముఖ అడ్వకేట్ డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, డా. ఎం.ఏ. సమద్, ఎం.డి. నయీమ్ ఉద్దీన్, సయ్యద్ అజాజ్ అహ్మద్ నియాజీ, ఎం.డి. మీర్ అజ్మద్ అలీ, ఎం.డి. ఖలీల్, ఎం.ఏ. రషాద్, ఎం.డి. షుబాన్, ఎం.డి. ఇక్బాల్, ఎం.డి. షఫీ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
