Warangal MGM Hospital Roof Collapse
* భవనం పైకప్పు కూలి నలుగురికి గాయాలు
* రోగులు, బంధువుల్లో ఆందోళన..
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్‌లోని ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ మహాత్మా గాంధీ స్మారక ఆస్పత్రి (MGM)లో ఆదివారం ఉదయం పైకప్పు భాగం కూలిపోవడంతో కలకలం రేగింది. ఆస్పత్రిలోని మేల్ మెడికల్ వార్డు యూనిట్-4 ఆరోగ్యశ్రీ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పైకప్పు ఒక్కసారిగా కూలి రోగులు, వారి బంధువులపై పడటంతో నలుగురికి గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
* రక్త నమూనాలు సేకరిస్తుండగా..
రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిబ్బంది షుగర్ పరీక్ష కోసం రక్త నమూనాలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడ ఉన్న ఓ రోగి బంధువు తెలిపారు. రక్త నమూనాలు తీస్తుండగా ఒక్కసారిగా వార్డు పైకప్పు భాగం కూలి కింద ఉన్నవారిపై పడిందని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
పైకప్పు కూలిన శబ్దంతో వార్డులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాయపడిన వారిని వెంటనే వైద్య సిబ్బంది గుర్తించి చికిత్స అందించినట్లు తెలిపారు .ఆ వార్డులో ఉన్నా వారిని మరో వార్డుకు తరలించినట్లు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.
* ఘటనపై సూపరింటెండెంట్ వివరణ..
MGM ఆస్పత్రిలో ఇటీవల కూడా భవనానికి సంబంధించిన సమస్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పైకప్పు కూలిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కే. రాంకుమార్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. ఈ రోజు MGM ఆస్పత్రిలో చిన్న ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ వార్డులోని స్లాబ్‌కు సంబంధించిన పైకప్పు భాగం కూలిందని చెప్పారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగలేదని, నలుగురికి స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు. గాయపడిన వారందరినీ మరో వార్డుకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
* పాత భవనం కావడంతోనే ఘటన..
ఆస్పత్రి భవనం పాతది కావడం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని సూపరింటెండెంట్ కే. రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత MGM ఆస్పత్రి భవనానికి బదులుగా నూతన ఆస్పత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయని, పనులు పూర్తయిన అనంతరం త్వరలోనే నూతన భవనంలో ఆస్పత్రి సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
* రోగులు, బంధువుల్లో ఆందోళన..
MGM ఆస్పత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తుంటారు. వార్డుల్లో రోగులతో పాటు వారి బంధువులు కూడా ఉంటారు. ఇలాంటి సమయంలో ఆస్పత్రి భవనంలోని పైకప్పు భాగాలు కూలిపోవడం రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఇప్పటికే పాత భవనం కావడంతో నిర్మాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు కూలిన ఘటన మరోసారి ఆస్పత్రి భవనాల పరిస్థితిపై చర్చకు దారితీసింది. అయితే తాజా ఘటనలో పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
