* పంగిడిపల్లి గ్రామస్తుల డిమాండ్
Kamalapur| ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం నుంచి పంగిడిపల్లికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఏళ్లుగా పూర్తికాకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డు సమస్యపై జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
నిరసనలో భాగంగా గ్రామస్తులు రోడ్డుపై టెంటు ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు టెంటును తొలగించారు. దీంతో గ్రామస్తులు రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. పంగిడిపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ వలిగే సాంబారావు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం ఆరేళ్లుగా పూర్తికాకపోవడంతో రహదారిపై కంకర తేలి ప్రయాణం ఇబ్బందికరంగా మారిందన్నారు. హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌కు రాకపోకలు సాగించే భారీ వాహనాలు, కంటైనర్ల కారణంగా దుమ్ము, ధూళి ఎక్కువగా ఏర్పడుతోందని తెలిపారు.
ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్తులు తరచూ ప్రమాదాలకు గురై గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా హామీలకే పరిమితమైందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. పనులు వెంటనే ప్రారంభించకపోతే ప్రతిరోజూ నిరసనలు చేపడతామని, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
