CPM Leaders Palakurthi
* ఎర్రజెండాతోనే సమస్యలకు పరిష్కారం.. సీపీఎం నాయకులు
* దర్దపల్లిలో తాళ్లపల్లి వెంకన్న ప్రథమ వర్ధంతి సభ
ఆకేరు న్యూస్, పాలకుర్తి : దేశంలో, రాష్ట్రంలో పీడిత ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకు కేవలం కమ్యూనిస్టు ఎర్రజెండాతోనే పరిష్కారం లభిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య స్పష్టం చేశారు.
ఆదివారం పాలకుర్తి మండలంలోని దర్దపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన యోధుడు, క్రియాశీలక కమ్యూనిస్టు కార్యకర్త తాళ్లపల్లి వెంకన్న ప్రథమ వర్ధంతిని అత్యంత భావోద్వేగాల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకన్న స్మారక స్థూపం వద్ద సీపీఎం పతాకాన్ని ఆవిష్కరించి, ఘన నివాళులర్పించారు. ఈ సభను ఉద్దేశించి సీపీఎం నాయకులు మాట్లాడుతూ, తాళ్లపల్లి వెంకన్న జీవితం ప్రజల పక్షాన నిలబడిన నిజమైన పోరాట స్ఫూర్తి అని కొనియాడారు.
పార్టీ అనుబంధ రైతు సంఘంలో అంకితభావంతో పని చేస్తూ, ఏ చిన్న బాధ్యత అప్పగించినా దానిని నెరవేర్చడంలో ఆయన ముందుండేవారని గుర్తుచేశారు. అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
* ప్రజా హక్కులను కాలరాస్తున్న కేంద్రం..
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు.
దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న చట్టబద్ధమైన హక్కులను ఒక్కొక్కటిగా కేంద్రం హస్తగతం చేసుకుంటూ, కార్మికులపై పని గంటలను విపరీతంగా పెంచి తీవ్రమైన శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
దేశంలో రోజురోజుకూ మతతత్వం, కులతత్వం పెట్రేగిపోతున్నాయని, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాల ద్వారా దేశ లౌకికస్ఫూర్తిని దెబ్బతీస్తూ సమాజాన్ని వెనక్కిలాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
* ఉపాధి హామీ నిర్వీర్యం..
పేద గ్రామీణ ప్రజల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నాగంగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. దీని స్థానంలో కొత్త విధానాలను తెచ్చి పేదలను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అన్నదాతల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి క్షమించరానిదని అన్నారు. రైతు వ్యతిరేక విద్యుత్ సవరణ చట్టాలు తేవడం, విదేశీ పత్తి దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసి విదేశీ దళారీలకు రెడ్ కార్పెట్ పరచడం వల్ల దేశీయ రైతులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస మద్దతు ధరల (MSP) చట్టాన్ని తీసుకురావడంలో కేంద్రం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని, పంటల బీమాను రైతు అనుకూలంగా మార్చకుండా, సమగ్ర రుణ విమోచన చట్టం తేకుండా కేవలం ఓట్ల రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
ప్రజల గొంతుకగా, పీడితుల పక్షాన నిరంతరం పోరాడే ఏకైక శక్తి సీపీఎం మాత్రమేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై ప్రజలంతా ఏకమై పెద్ద ఎత్తున పోరాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సోమ సత్యం, ఏదునూరి మదార్, మూస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, సీనియర్ నాయకులు సోమ అశోక్ బాబు, వేల్పుల కొమురయ్య, తోటరాజు, నిమ్మల పెద్దపురం, సాంబయ్య, ఓగ్గుల కొమురయ్య; వెంకన్న కుటుంబ సభ్యులు తాళ్లపల్లి కుమారస్వామి, ఉప సర్పంచ్ బాలవేణి సోమయ్య, గిరగాని నరసయ్య, చిట్యాల మధు, గడ్డి రామచంద్రం, గబ్బెట శ్రీనివాస్, పూజారి రాజయ్య, తాళ్లపల్లి రాజు, తాళ్లపల్లి మదర్, దుంపల శ్రీను, పి. యాకయ్య, వేల్పుల సోమనరసయ్య, జి. కృష్ణ, తాడం వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

