Vashapaka Anil
*వశపాక అనిల్‌కు అరుదైన గౌరవం
* ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ-2026’ సదస్సులో ఘన విజయం
* ఏఐజీ తరఫున ఇన్వెస్టిగేటర్ అవార్డు ప్రెజెంటేషన్‌లో ప్రథమ బహుమతి
* అనిల్ దంపతులను అభినందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్, తొర్రూరు : కష్టాలను మెట్లుగా మలచుకుంటే ఏ రంగంలోనైనా శిఖరాగ్రానికి చేరుకోవచ్చని నిరూపించారు వరంగల్ జిల్లాకు చెందిన యువ ప్రతిభావంతుడు వశపాక అనిల్. గ్రామీణ ప్రాంతం నుండి కఠోర దీక్ష, అంకితభావంతో పరిశోధనా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆయన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
న్యూఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ-2026’ (World Congress of Gastroenterology) సదస్సులో దేశవ్యాప్తంగా పలువురు నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ మహాసభలో ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రి తరఫున ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్టిగేటర్ అవార్డు’ కోసం జరిగిన ప్రెజెంటేషన్ పోటీల్లో అనిల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించారు. దేశం గర్వించదగ్గ ఈ అరుదైన విజయం ద్వారా మన తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి, వినోద దంపతుల ద్వితీయ కుమారుడైన అనిల్.. ఈ స్థాయికి ఎదగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో తొర్రూరు విచ్చేసిన వశపాక అనిల్, ఆయన సతీమణి నిత్య దంపతులను రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్వయంగా తమ నివాసానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, అభినందనలు తెలిపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. “సాధారణ గ్రామీణ కుటుంబం నుంచి వచ్చి, అంతులేని పట్టుదలతో అసాధారణ ప్రతిభను చాటుకోవడం మామూలు విషయం కాదు. తల్లిదండ్రుల ఆశయాలను, కష్టాలను ఆదర్శంగా తీసుకుని అనిల్ ఈరోజు వైద్య, పరిశోధనా రంగంలో దేశానికే తలమానికంగా నిలిచారు.
నేటి యువతకు అనిల్ ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. అన్నారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పరిశోధనలు సమాజానికి మరింత ఉపయోగపడాలి. అనిల్ విజయాల వెనుక ఉన్న కుటుంబ సభ్యుల కృషి అభినందనీయం మన్నారు. భవిష్యత్తులో ఆయనకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని’’ స్పష్టం చేశారు
ఈ సన్మాన కార్యక్రమంలో రాయపర్తి మండల పరిషత్తు మాజీ అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మహబూబ్ రెడ్డి, మాక్స్ డైరెక్టర్ డి. యాదగిరి, తిరుమలాయపల్లి గ్రామ సర్పంచ్ బరిగల బాబు, వశపాక మల్లయ్య, యాకయ్య, కొమురయ్య, రాయశెట్టి యాకేందర్, రాజు తదితరులు పాల్గొని అనిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

