Telugu Script Evolution
* బ్రాహ్మి నుంచి ఆధునిక తెలుగు వరకు అక్షరాల అద్భుత ప్రయాణం
* ఒకప్పుడు ఇంగ్లీష్ అక్షరాలను పోలిన తెలుగు అక్షరాలు
* మౌర్యుల నుంచి కాకతీయుల వరకు మారిన లిపి రూపాలు
* తెలుగు లిపి పరిణామానికి సాక్ష్యంగా వరంగల్ పురావస్తు ప్రదర్శనశాల
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్, వరంగల్ :
మనం ఇప్పుడు రాస్తున్న తెలుగు అక్షరాలు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఇదే రూపంలో ఉండేవా..? మనకు తెలిసిన అ, ఆ, ఇ, ఈ అక్షరాలు తొలినాళ్లలో ఎలా ఉండేవి..? నేటి తెలుగు అక్షరమాల రూపుదిద్దుకోవడానికి ఎన్ని శతాబ్దాలు పట్టింది..? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వరంగల్ పురావస్తు ప్రదర్శనశాలలో లభిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన తెలుగు లిపి పరిణామక్రమం పటం మన అక్షరాల చరిత్రను కళ్లకు కడుతోంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దపు బ్రాహ్మి లిపి నుంచి మధ్యయుగ తెలుగు లిపి వరకు అక్షరాల ఆకృతుల్లో వచ్చిన మార్పులను ఈ పటంలో చూడవచ్చు. నేడు మనం రాస్తున్న ‘అ’ అక్షరానికి పూర్వకాలపు రూపం ఇంగ్లీష్‌లోని ‘K’ అక్షరాన్ని తిరగేసినట్లు కనిపించడం విశేషం. మరో కాలంలో అదే అక్షరం ‘Y’ ఆకారాన్ని పోలి ఉండటం మరింత ఆసక్తికరం. రాజవంశాలు మారిన కొద్దీ అక్షరాల రూపాలు కూడా మారుతూ వచ్చాయి. దాదాపు 2,300 ఏళ్ల లిపి పరిణామ చరిత్రను ఒకే పటంలో ప్రదర్శించడం ఈ పటం ప్రత్యేకతగా కనిపిస్తుంది. తెలుగు అక్షర మాల పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం..

* బ్రాహ్మి లిపిలోనే తెలుగు అక్షరాల మూలాలు
తెలుగు లిపి చరిత్రను తెలుసుకోవాలంటే ముందుగా బ్రాహ్మి లిపి గురించి తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడి కాలం నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రాహ్మి లిపి విస్తృతంగా వాడుకలో ఉంది. అశోకుని శాసనాలు ఈ లిపికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక ఆధారాలు. కాలక్రమంలో బ్రాహ్మి లిపి వివిధ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందింది. ఈ పరిణామక్రమంలోనే తెలుగు, కన్నడతోపాటు అనేక భారతీయ లిపులు అభివృద్ధి చెందాయి. అయితే క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలోనే నేటి తెలుగు లిపి పుట్టిందని భావించడం సరికాదని భాషా పండితులు చెబుతున్నారు. తెలుగు లిపికి మూలమైన ప్రాచీన లిపి సంప్రదాయాలను ఆ కాలంలో గుర్తించవచ్చన్నదే చారిత్రక వాస్తవంగా చెబుతున్నారు.
* ఇంగ్లీష్ ‘K’ అక్షరాన్ని పోలిన ‘అ’
వరంగల్ పురావస్తు ప్రదర్శనశాలలోని పటాన్ని పరిశీలిస్తే మౌర్యుల కాలపు బ్రాహ్మి అక్షరాలు నేటి తెలుగు అక్షరాలకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ‘అ’ అక్షరానికి సంబంధించిన ప్రాచీన రూపం ఇంగ్లీష్‌లోని ‘K’ అక్షరాన్ని తిరగేసినట్లు ఉంది. ‘ఆ’ అక్షరం కూడా స్వల్ప మార్పులతో దాదాపు అదే ఆకారాన్ని పోలి కనిపిస్తోంది. ‘ఇ’ అక్షరానికి సంబంధించిన రూపం రెండు చుక్కల మాదిరిగా ఉండగా, ‘ఉ’ అక్షరం ఇంగ్లీష్‌లోని ‘L’ అక్షరాన్ని గుర్తుచేస్తోంది. మిగిలిన అక్షరాల ఆకృతుల్లోనూ నేటి తెలుగు లిపితో పోలిస్తే గణనీయమైన తేడాలు ఉన్నాయి. అయితే ఇవి ఆకారాల ఆధారంగా కనిపించే పోలికలు మాత్రమే. మరింత సులభంగా అర్థమవుతుందని మాత్రమే ఆ పోలికలను చూపిస్తుంటారని వారు అంటున్నారు. నిజానికి అప్పటి బ్రాహ్మి అక్షరాలను ఆధునిక ఇంగ్లీష్ అక్షరాలకు ఎలాంటి చారిత్రక సంబంధం లేదని భాషా నిపుణులు చెబుతుంటారు.
* భట్టిప్రోలు శాసనాలు.. లిపి చరిత్రకు ఆధారాలు
దక్షిణ భారతదేశ లిపుల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని భట్టిప్రోలు బౌద్ధ స్తూపం వద్ద లభించిన శాసనాలు అత్యంత ముఖ్యమైనవి. పురాతన ధాతు కరండాలపై చెక్కిన బ్రాహ్మి అక్షరాలు ప్రత్యేకమైన ప్రాంతీయ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ శాసనాల్లో కనిపించే కొన్ని అక్షర రూపాలు ఇతర ప్రాంతాల్లోని బ్రాహ్మి లిపితో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. బ్రాహ్మి లిపి ప్రాంతాలవారీగా ఎలా మార్పులు చెందిందో తెలుసుకోవడానికి భట్టిప్రోలు శాసనాలు విలువైన ఆధారాలుగా నిలిచాయి. వరంగల్ ప్రదర్శనశాలలోని పటంలోనూ భట్టిప్రోలు ధాతు కరండాలపై లభించిన అక్షరాలకు ప్రత్యేక వరుస కేటాయించారు.
* శాతవాహనుల కాలంలో ” ఆకారంలో ‘అ’
క్రీస్తుశకం మొదటి శతాబ్దం నాటికి శాతవాహనుల పాలనలో బ్రాహ్మి లిపి వినియోగం కొనసాగింది. గుహలు, శిలలపై చెక్కిన శాసనాల్లో ఈ లిపి రూపాలు కనిపిస్తున్నాయి. ఈ కాలానికి సంబంధించిన అక్షరాలను పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మౌర్యుల కాలంలో తిరగేసిన ‘K’ అక్షరాన్ని పోలిన ‘అ’ రూపం, శాతవాహనుల కాలపు నమూనాలో ఇంగ్లీష్ ‘y’ అక్షరాన్ని పోలి ఉంది. మిగిలిన అక్షరాల ఆకృతుల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. లిపి పరిణామం …

Please tell us what is wrong. Your report will be sent to the website team.

