Mahabubabad| ఆకేరు న్యూస్, మహబూబాబాద్: దసరా సెలవుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపాల్సిన ఓ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ గ్రామ పరిధిలోని కాకర్ బోర్డ్ తండాలో చోటుచేసుకుంది.
ఆడుకుంటూ ప్రమాదం
మరిపెడ మున్సిపాలిటీలోని ఐదో వార్డుకు చెందిన బోడ హరీష్, అరుణ దంపతుల కుమారుడు అక్షిత్ (9) కేరళ గ్లోబల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అక్షిత్.. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు హరీష్, అరుణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే తమ మొదటి కుమార్తెను చిన్నతనంలోనే కోల్పోయిన ఆ దంపతులకు, రెండో సంతానమైన అక్షిత్ కూడా దూరం కావడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
చిన్నారి మృతితో మరిపెడ మున్సిపాలిటీలోని ఐదో వార్డుతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబంలో సంతోషాలు నింపాల్సిన చిన్నారి ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

