* డ్రైవర్‌కు సజ్జనార్ వార్నింగ్..
* లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక
Hyderabad| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన ఆటో డ్రైవరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? డ్రైవింగ్ చేస్తూనే ఓవైపు సినిమా చూస్తూ, మరోవైపు హెడ్ఫోన్లు పెట్టుకున్న ఆటో డ్రైవర్ ఉదంతం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆటోను ఏకంగా మినీ థియేటర్‌గా మార్చుకున్న ఈ డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారి వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
రెండు ఫోన్లు.. హెడ్ఫోన్లు
వైరల్ అవుతున్న వీడియోలో TG15U2657 నంబర్ గల ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ముందు రెండు మొబైల్ ఫోన్లు ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక ఫోన్లో మార్గాన్ని చూపించే నావిగేషన్ ఉండగా, మరో ఫోన్లో సినిమా చూస్తూ వాహనం నడుపుతున్నట్లు వీడియోలో వెల్లడైంది. దీనికి తోడు చెవులకు హెడ్ఫోన్లు పెట్టుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ దృశ్యాలను తన మొబైల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ సమయంలో రోడ్డుపై దృష్టి పెట్టాల్సిన వ్యక్తి ఇలా ఇతర విషయాల్లో నిమగ్నమైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లైసెన్స్ రద్దు చేస్తాం!
ఈ ఘటనపై వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆటోను గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, హెడ్ఫోన్లు ధరించడం వల్ల రోడ్డుపై ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆటోలను మినీ థియేటర్లుగా మార్చుకుని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ప్రయాణికులకు కీలక సూచన
డ్రైవర్లు ప్రయాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రయాణికులు మౌనంగా ఉండకూడదని సజ్జనార్ సూచించారు. డ్రైవర్‌ను జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని, పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేసి సహాయం కోరాలని సూచించారు.
ప్రయాణికుల భద్రత డ్రైవర్ల బాధ్యత అని, క్షణిక నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

