RDO Kiran Prakash
* రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం!
ఆకేరు న్యూస్,స్టేషన్ ఘన్ పూర్ : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు భూముల లెక్కలను పక్కా చేయాలని అందుకు ‘రీ సర్వే’ చేయాలని నిర్ణయించింది. పట్వారి వ్యవస్థ రద్దయిన తర్వాత వీఆర్వోల పాలనలో భూముల లెక్క తప్పి భూ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పట్టా ఉండి పాస్ పుస్తకాలు లేకపోవడం, ఒక సర్వే నంబర్ భూమి మరో సర్వే నంబర్లు ఉండడం, ఒకరు భూమి మరొకరి సర్వే నంబర్లకు చేరడం లాంటి మొదలైన సమస్యలకు ఈ సర్వే శాశ్వత పరిష్కారం ఇవ్వనుంది.
డివిజన్లో 10 గ్రామాలు.. మండలానికి రెండు గ్రామాలు..
స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్, జఫర్గడ్ పాలకుర్తి, కొడకండ్ల ఐదు మండలాల్లో 10 గ్రామాలను ఎంపిక చేశారు. భూముల రీ సర్వేకు ప్రతి మండలం నుండి రెండు గ్రామాలను ఎంపిక చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ మండలంలో కొత్తపల్లి, తాటికొండ గ్రామాలను ఎంపిక చేయగా అందులో తాటికొండ సర్వే పూర్తి చేసిన అధికారులు కొత్తపెళ్లి సర్వే ప్రారంభం చేయాల్సి ఉంది. చిల్పూర్ మండలంలో రాజవరం, వెంకటాద్రి పేట గ్రామాలు సర్వేకు ఎంపిక కాగా అందులో రాజవరం సర్వే పూర్తి చేయగా వెంకటాద్రి పేట పూర్తి చేయాల్సి ఉంది.
జఫర్గడ్ మండలంలో అలియాబాద్, షాపల్లి గ్రామాలు ఎంపిక చేయగా అలియాబాద్ పూర్తి చేసిన అధికారులు షాపల్లిలో సర్వే చేయాల్సి ఉంది. పాలకుర్తి మండలంలో తిరుమలగిరి, లక్ష్మి నారాయణపురం గ్రామాలు ఎంపిక చేయగా అందులో లక్ష్మీ నారాయణ పురం సర్వే పూర్తి చేయగా తిరుమలగిరి సర్వే చేయాల్సింది. కొడకండ్ల మండలంలో రామవరం, నరసింగాపురం అమలు ఎంపిక చేయగా నర్సింగాపురం సర్వే పూర్తి చేశారు. రామవరం సర్వే చేయాల్సి ఉంది.
రైతులకు ముందస్తు సమాచారం..
రీ సర్వే సమయంలో అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇస్తారు. సర్వే సమయంలో చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులు కూడా రావాల్సి ఉంటుంది. వారందరి సమక్షంలో భూమిని రోవర్ మిషన్ తో కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. సర్వే సమయంలో అధికారులు ఇచ్చిన భూమి పత్రాలు, గతంలో మంజూరు చేసిన పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డుకు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ రైతు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
మొదటి దశలో 79 గ్రామాలు..
భూములకు రీ సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సర్కార్ భావిస్తుంది. జిల్లాలో మొదటి దశలో 79 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. మొదట గ్రామాల సరిహద్దులను గుర్తించి, ప్రభుత్వ భూములు, రోడ్లు, వాగులు వంకలను సర్వే చేసిన అనంతరం ప్రైవేటు (రైతుల) భూములను రి సర్వే చేస్తారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్స్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించే సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.
రైతుల ఇబ్బందులు తొలుగుతాయి : ఆర్డీవో కిరణ్ ప్రకాష్
భూముల రీ సర్వే ద్వారా ఇన్నాళ్లు రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. రోవర్ సర్వే తో గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రోడ్లు గుర్తించిన అనంతరం సర్వే నంబర్ల వారిగా రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించడంతోపాటు మ్యాపులు కూడా ఇస్తారు. దీనితో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ పరిధిలో చిల్పూర్ మండలం వెంకటాద్రి పేట, పాలకుర్తి మండలం తిరుమలగిరి, కొడకండ్ల మండలం నర్సింగాపూర్, జఫర్గడ్ మండలం అలియాబాద్ గ్రామాల్లో సర్వే పూర్తిచేసినట్లు ఆర్డీవో కిరణ్ ప్రకాష్ తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

