* అక్టోబర్ 20 నుంచి ఓపీ సేవలు ప్రారంభం..
* డిసెంబర్ 15లోగా పూర్తిస్థాయి వైద్యసేవలు
ఆకేరు న్యూస్, వరంగల్: అక్టోబర్ 20న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్స్ సేవలను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, కుడా చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు ఆస్పత్రిని సందర్శించి ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన చిన్నపాటి అవరోధాలను తొలగించి ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
అక్టోబర్ 17న మరోసారి ప్రజాప్రతినిధులతో కలిసి ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తామని చెప్పారు. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ 15లోగా మిగిలిన పనులను పూర్తి చేసి పూర్తిస్థాయి వైద్యసేవలను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. పూర్తిస్థాయి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతారని వెల్లడించారు.
యుద్ధప్రాతిపదికన పనులు
గత ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనులను వేగవంతం చేసి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణకు వైద్య భరోసా
ఉమ్మడి వరంగల్తోపాటు పరిసర జిల్లాల ప్రజలకు ఎంజీఎం ఆస్పత్రిపై ఎంతో నమ్మకం ఉందని పొంగులేటి అన్నారు. ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల నుంచి వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. గిరిజన, గిరిజనేతర ప్రాంతాలకు చెందిన పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే మెరుగైన వైద్యం అందుతుందన్న ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోజుకు 5 వేల వరకు ఓపీ!
ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి రోజూ 3 వేల మందికిపైగా ఓపీ సేవల కోసం వస్తున్నారని మంత్రి తెలిపారు. కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 4 వేల నుంచి 5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తే పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే కీలక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

