* 24న గ్రాండ్ రిలీజ్
* రామానుజుల కథతో సినిమా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆధ్యాత్మిక విప్లవకారుడు శ్రీ రామానుజాచార్యుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘జయహో రామానుజ’ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. ఈ నెల 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
రామానుజాచార్యుల గొప్పదనం చాటే చిత్రం
ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరో, దర్శకుడు లయన్ డా. సాయి వెంకట్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో తన ప్రయాణం 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. తన తొలి చిత్రంలో హీరోగా నటించిన సుమన్.. ఇప్పటికీ అలుపెరగకుండా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ‘జయహో రామానుజ’ చిత్రంలో సుమన్ మంచి పాత్ర పోషించారని తెలిపారు.
రామానుజాచార్యుల జీవిత కథను తెరకెక్కించేందుకు ఎంతో శ్రమించామని, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను రూపొందించామని చెప్పారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా, రామానుజాచార్యుల గొప్పతనాన్ని ఈ తరం ప్రేక్షకులకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది మా అదృష్టం: ప్రవళ్లిక
నటి, నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ.. ‘జయహో రామానుజ’ వంటి గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ బాధ్యతలతో పాటు సినిమాలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లోనూ నటించినట్లు వెల్లడించారు.
రామానుజాచార్యుల జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని, ఆయన బోధనలు ఈ తరం ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందించినట్లు వివరించారు.
అందరూ ఒక్కటేనని చాటిన రామానుజాచార్యులు
నటుడు సుమన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ గురించి సాయి వెంకట్ చెప్పినప్పుడు, ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని భావించానన్నారు. అయితే, సినిమాను రూపొందించాలనే బలమైన సంకల్పంతో సాయి వెంకట్ ముందుకు సాగారని ప్రశంసించారు. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
భారతదేశంలో అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నప్పటికీ ప్రజలంతా కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ సమానమేనని, మానవులంతా ఒక్కటేననే భావనను బలంగా చాటిన మహనీయుడు రామానుజాచార్యులని అన్నారు. ఆయన సందేశాలు నేటికీ ప్రజలను ఐక్యంగా నడిపిస్తున్నాయని తెలిపారు. ప్రేక్షకులు కుటుంబ సభ్యులతో కలిసి ‘జయహో రామానుజ’ చిత్రాన్ని చూసి, రామానుజాచార్యుల గొప్పతనాన్ని తెలుసుకోవాలని సుమన్ కోరారు.
చిత్ర బృందం
ఈ చిత్రంలో లయన్ డా. సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక, అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ తదితరులు నటించారు. సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్పై సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక నిర్మించారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను లయన్ డా. సాయి వెంకట్ నిర్వహించారు. చిత్రానికి పీఆర్వోగా చందు రమేష్ వ్యవహరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

