El Nino Impact in Telangana CM Revanth Reddy Review
* రైతన్నలు ఒక సీజన్ పంట వాయిదా వేసుకోవాలి..
* కేంద్రం సహకరించాలి..
* దసరా తర్వాత అఖిలపక్షం.. నవంబర్‌లో ఢిల్లీకి డెలిగేషన్ – సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న తీవ్రమైన ‘ఎల్‌నినో’ (El Nino) వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో, ప్రకృతి ప్రకోపంతో తలెత్తిన ఈ విపత్తును అధిగమించడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మండుతున్న ప్రచండ భానుడి ప్రతాపం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తులో తలెత్తబోయే సాగు, తాగునీటి ఎద్దడి మరియు నిమిషనిమిషానికీ పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమీక్షా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి మరియు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల రావుతో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
* పంట వాయిదా వేసుకోండి – రైతులకు సీఎం విజ్ఞప్తి
పరిస్థితి తీవ్రతను వివరిస్తూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అత్యంత భావోద్వేగమైన విజ్ఞప్తి చేశారు. పరిస్థితి తీవ్రతను, రాబోయే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు పెద్ద మనసుతో ఈ వేసవి సీజన్లో వరి పంటలు వేయడం పూర్తిగా తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, అందుబాటులో ఉన్న నీటిని ప్రజా ప్రాణాల తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి సహకరించాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి నిర్లక్ష్యంగా వరి పంటలు వేస్తే, చివర్లో నీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల పెట్టిన పెట్టుబడి నష్టపోవడమే కాకుండా, భూగర్భ జలాలు అడుగుంటి బోర్ మోటార్లు, విద్యుత్ మీటర్లు కాలిపోయే దారుణ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వ్యవసాయ పనులు తగ్గడం వల్ల ఉపాధి కోల్పోయే భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీ పనులకు వచ్చే అవకాశం ఉన్నందున, వారికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత మంత్రికి స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుత వానాకాలంలో పంట నష్టపోయిన వారితో పాటు, రాబోయే ఎండాకాలంలో ప్రభుత్వ పిలుపు మేరకు పంటలు వాయిదా వేసుకునే రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రకృతి విపత్తుల నిధి (NDRF) నుంచి తగిన ఆర్థిక పరిహారం అందించి ఆదుకోవాలి.
* పడిపోతున్న నీటి మట్టాలు..
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సాధారణంగా మార్చి నెలలో ఉండాల్సిన ఎండ తీవ్రత ఇప్పుడే ప్రారంభమైంది. అప్పుడే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం మునుపెన్నడూ లేని పరిణామం. రానున్న కాలంలో నీరు, విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత 3 ఏళ్లలో తెలంగాణలో సగటు విద్యుత్ వినియోగం 15,000 మెగావాట్లుగా ఉండగా, నేడు అది ఏకంగా 20,000 మెగావాట్ల ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. 2014-15 నాటికి సగటున 6,500 నుండి 7,000 మెగావాట్లు మాత్రమే ఉన్న వినియోగం, గడిచిన 13 ఏళ్లలో 14,000 మెగావాట్లు పెరిగింది. చివరికి గడిచిన రెండేళ్లలోనే 6-7 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులకు, పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా బహిరంగ మార్కెట్లో ఏ రేటుకు దొరికితే ఆ రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాం. సాధారణంగా చలికాలంలో నిండుగా ఉండే రిజర్వాయర్లు, ఈసారి చలికాలం ప్రారంభానికి ముందే వట్టిపోతున్నాయి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం కేవలం 200 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24,000 గ్రామాలకు నిరంతరం మంచినీటి సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని రాబోయే జూన్ వరకు (మరో 8 నుండి 10 నెలల పాటు) అత్యంత పొదుపుగా వాడుకోవాల్సి ఉంది.

* నవంబర్‌లో ఢిల్లీ పర్యటన
ఈ జాతీయ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై దసరా పండుగ ముగిసిన వెంటనే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఈ భేటీలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రంలో తలెత్తిన సంక్షోభాన్ని వివరించి ప్రత్యేక ఆర్థిక, నీటి సహకారం కోరుతాం. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల నుంచి, సెంట్రల్ పూల్ నుంచి తెలంగాణకు సబ్సిడీ ధరకు అదనపు విద్యుత్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. సబ్ కమిటీ ఏర్పాటు, వార్ రూమ్ మరియు నోడల్ అధికారి నియామకం. ఎల్‌నినో విపత్తును నిమిషనిమిషం పర్యవేక్షించడానికి ప్రభుత్వం పలు కీలక రక్షణ చర్యలు చేపట్టింది.
ఈ విపత్తు పరిస్థితులను అనునిత్యం పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రత్యేక మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అధికారిక సమాచారం అందించడానికి, అపోహలను నివారించడానికి సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావును ప్రభుత్వ నోడల్ అధికారిగా నియమించారు. పుకార్లు, తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజలకు 24 గంటల పాటు సరైన సమాచారాన్ని, సలహాలను అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం అన్నారు. మూగజీవాలకు గ్రాసం, తాగునీరు కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రచండ వేడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా అప్రమత్తం చేశాం అన్నారు. “ఐక్యరాజ్యసమితి హెచ్చరించినట్లు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలపై ఎల్‌నినో వినాశకర ప్రభావం ఉంది. ఇది మనందరిపై పడిన ప్రకృతి విపత్తు. రాజకీయానుబంధాలకు అతీతంగా ప్రతిపక్షాలు, మహిళా, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు మరియు పౌరులందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి ఈ సంక్షోభాన్ని జయించాలి” అని సీఎం రేవంత్ అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

