AP Local Body Elections 2026 SEC Anil Chandra
* రంగంలోకి ఎన్నికల కమిషన్
* శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
* ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా హెచ్చరిక
* హింసాత్మక ఘటనలపై తక్షణమే కేసులు : ఐజీ
ఆకేరున్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తొలిరోజే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఘర్షణల నేపథ్యంలో విజయవాడలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణపై కమిషన్ తీసుకుంటున్న కఠిన చర్యలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు.
* ఫిర్యాదులపై తక్షణ స్పందన
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయ నేతలు చేసిన ఫిర్యాదులపై వెంటనే స్పందించామని ఎస్ఈసీ తెలిపారు. ఫిర్యాదులు అందగానే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను సకాలంలో అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
* అదనపు బలగాల మోహరింపు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ఎస్ఈసీ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
* అధికారుల నిర్లక్ష్యంపై వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వేటు తప్పదని ఎస్ఈసీ హెచ్చరించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో సిబ్బంది గానీ, అధికారులు గానీ ఎలాంటి పక్షపాత ధోరణి ప్రదర్శించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని.. తక్షణమే వారిని సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్ఈసీ పునరుద్ఘాటించారు.
* హుటాహుటిన ఘటనా స్థలానికి : ఎస్పీ
పుంగనూరులో హింస చెలరేగిన వెంటనే జిల్లా ఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారని ఐజీ రాజకుమారి వెల్లడించారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి సున్నితమైన పోలింగ్ స్టేషన్లోనూ తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లర్లు, గొడవలు సృష్టించవద్దని రాజకీయ నేతలను కోరిన ఆమె, ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ హింసాత్మక ఘటనకు బాధ్యులు ఎవరో గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* సురక్షితంగా నామినేషన్ల ప్రక్రియ
నామినేషన్లు సక్రమంగా జరిగేలా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని, అభ్యర్థులను స్వయంగా నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి సక్రమంగా నామినేషన్ వేసేందుకు పూర్తి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా సీసీటీవీ కెమెరాల కవరేజ్ ద్వారా పర్యవేక్షిస్తూ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఐజీ రాజకుమారి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

