Station Ghanpur
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా మున్సిపల్ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.
మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ఆకర్షణీయమైన లైటింగ్, హైమాస్ లైట్లు, డీజే సౌండ్ సిస్టమ్తో పాటు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
మూడు ప్రాంతాల్లో వేడుకలు
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా, ప్రజల సౌకర్యార్థం మూడు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. స్టేషన్ ఘన్ పూర్లోని రిజర్వాయర్ కట్టపై, చాగల్లోని రైతు వేదిక వద్ద, శివునిపల్లిలో బొడ్రాయి, చెరువు కట్ట ప్రాంతాల్లో బతుకమ్మలు ఆడేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో వార్డు సభ్యులు కూడా సహకరిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లోనూ సందడి
స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ, నమిలికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలతో పాటు చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట, మల్కాపూర్, చిన్న పెండ్యాల తదితర గ్రామాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, ఆటపాటలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

