* హైదరాబాద్‌లో పొంచి ఉన్న ముఠాలు?
* కొద్ది రోజులుగా దొంగల పంజా
* నిఘా పెంచిన పోలీసులు
* సమాచారం ఇస్తే.. భద్రత కల్పిస్తామని వెల్లడి
Hyderabad Crime| పండుగల ఊళ్లకు సంఘోషంగా ఇళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులను దొంగల భయం వెంటాడుతోంది. పలుచోట్ల దొంగలు ఇప్పటికే పంజా విసరడంతో ఆందోళన చెందుతున్నారు. దసరా, దీపావళి వరుస సెలవులు, ఆపై పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తే.. ఇండ్లకి తాళాలు వేయడమే ఒక పెద్ద సాహసంగా మారింది. ఒకవైపు అత్యాధునిక సాంకేతికత, సీసీటీవీ నిఘా, పెట్రోలింగ్ అంటున్నప్పటికీ.. మరోవైపు దొంగల ముఠాలు మాత్రం పోలీసుల భద్రతా వలయాలను ఛేదించి రెచ్చిపోతున్నాయి. సరిగ్గా పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు, పేరుమోసిన గ్యాంగ్‌లు నగరంలో వరుస చోరీలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.
చెడ్డీ గ్యాంగ్‌ల హల్చల్
సైబరాబాద్ పరిధిలోని నెక్నాంపూర్లో కొద్దిరోజుల క్రితం ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను టార్గెట్ చేస్తూ విచిత్రమైన, భయానకమైన రీతిలో ‘చెడ్డీ గ్యాంగ్’ ప్రవేశించింది. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా, ముఖాలకు మాస్కులు ధరించి, చేతుల్లో మారణాయుధాలతో వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా బీభత్సం సృష్టించి రూ. 80 వేల నగదు దోచుకెళ్లింది. ఈ ఘటనతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారి ఆనవాళ్లు ఉన్నాయన్న భయం ఊళ్లకు వెళ్లిన వారిని వెంటాడుతోంది. పక్క ఇళ్లు లేదా సమీప బంధువులకు తరచూ ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు.
అల్వాల్‌లో భారీ చోరీలు
హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోని అల్వాల్‌లో ఒకేసారి రెండు నివాసాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ. 30 లక్షల విలువైన 20 తులాల బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పగటిపూట లేదా రాత్రి సమయాల్లో రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని ఇళ్లను ఎంచుకుని మరీ ఈ చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో పండుగలకు ఊళ్లకు వెళ్లే వారు సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇస్తే తగిన భద్రత ఏర్పాటు చేస్తామని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా దొంగల వేట
నగరంలోని ఖరీదైన అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలను స్టడీ చేస్తూ ఎక్కడెక్కడ ఇళ్లకు తాళాలు ఉంటున్నాయో గమనిస్తున్నారు. ఆ తర్వాత తమ సొంతూళ్ల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ క్రిమినల్స్‌ను రప్పించి, ప్లాన్ ప్రకారం చోరీలకు తెగబడుతున్నారు. స్థానిక పరిస్థితులు, దారులు పూర్తిగా తెలిసి ఉండటం వల్ల వీరు పోలీసులకు సులభంగా చిక్కకుండా తప్పించుకోగలుగుతున్నారు.
మరువలేని మేడిపల్లి ఘటన
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో జరిగిన ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘క్యారెట్ లైన్ గోల్డ్ అండ్ డైమండ్స్’ షోరూమ్ షట్టర్‌ను అత్యంత చాకచక్యంగా పైకి లేపిన దొంగలు, సరిగ్గా ఐదు నిమిషాల వ్యవధిలో సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. కేవలం నిమిషాల వ్యవధిలో అంత భారీ మొత్తంలో వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తే, ఇది కచ్చితంగా స్థానిక సమాచారంతో, ఇతర రాష్ట్రాల ముఠాలు కలిసి పథకం ప్రకారమే చేసిన పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఉపాధి ముసుగులో నేరాలు
నగరానికి ఉపాధి కోసం వలస వస్తున్న కొందరి తీరు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్, హరియాణా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వస్తున్న యువకులు మొదట్లో భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా, చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఇక్కడి ప్రాంతాలపై పూర్తి అవగాహన పెంచుకుంటున్నారు. ఆ తర్వాత వారి అసలు పని మొదలుపెడుతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆ సమాచారం అధికారికంగా బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలున్నాయి.
సీపీ సజ్జనార్ ఏమంటున్నారంటే..
వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో నగర పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లే నగరవాసులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు సూచనలు చేశారు.
* ఊళ్లకు వెళ్లినా ఇళ్లలో లైట్లు వెలిగేలా టైమర్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
* విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి.
* చుట్టుపక్కల ఉండే స్థానిక పోలీసు స్టేషన్‌కు తాము ఊరికి వెళ్తున్న సమాచారం అందిస్తే, ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచడానికి వీలవుతుంది.
* అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉండేలా చూసుకోవడంతో పాటు, గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
* పండుగలు ఆనందంగా జరుపుకోవాలి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది.
* ఎక్కడికక్కడ నిఘా పెంచాము.. మీరిచ్చే సమాచారంతో మరింత భద్రత పెంచేందుకు అవకాశం ఉంటుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

