Saddula Bathukamma| ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు పాలకుర్తి నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ సంబరాలు చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పల్లెల్లో పండుగ వాతావరణాన్ని నింపాయి. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
కిష్టాపురంలో కనులపండువగా వేడుకలు
నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ మహిళలు, యువతులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం గ్రామ ప్రధాన వీధుల గుండా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం
కిష్టాపురం చెరువు కట్ట వద్ద మహిళలు బతుకమ్మలను వలయాకారంలో ఉంచి జానపద గేయాలు ఆలపిస్తూ వేడుకలను నిర్వహించారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ‘పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ.. మళ్లీ ఏడాదికి రావాలమ్మా’ అంటూ భావోద్వేగాల మధ్య బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరగడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవం మరోసారి ప్రతిబింబించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

