Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధితో పాటు స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్ మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో పూజలందుకున్న గౌరమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు.
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారులు వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని పెద్ద సంఖ్యలో రిజర్వాయర్ కట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ బతుకమ్మలను ఉంచి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఉయ్యాల పాటలు, డీజే పాటలతో సందడి చేస్తూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. అనంతరం గౌరమ్మకు వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేశారు.
అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని తాటికొండ, కొత్తపల్లి, నెమలిగొండ, ఇప్పగూడెం గ్రామాలతో పాటు చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట, మల్కాపూర్, చిన్న పెండ్యాల, చిల్పూర్ గ్రామాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ రీతిలో నిమజ్జనం నిర్వహించి గౌరమ్మకు వీడ్కోలు పలికారు.
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా గ్రామాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

