Telangana Assistant Professor Jobs 2026
* కేయూలో 49 పోస్టులు
* ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి
* రోస్టర్ అనంతరం నోటిఫికేషన్లు.. బోధనా ప్రతిభకూ ప్రాధాన్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలకు ముందడుగు పడింది. ఏడు వర్సిటీల్లో మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Telangana Assistant Professor Jobs) పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో కాకతీయ విశ్వవిద్యాలయంలోని 21 విభాగాలకు 49 పోస్టులు కేటాయించారు. ఆర్థిక శాఖ ఆమోదంతో ఆయా విశ్వవిద్యాలయాలు రోస్టర్ ఖరారు, నియామక ప్రకటనల జారీకి చర్యలు చేపట్టనున్నాయి.
* ఉస్మానియాకే అత్యధిక పోస్టులు..
మొత్తం అనుమతించిన పోస్టుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అత్యధికంగా 252 కేటాయించారు. కాకతీయ- 49 శాతవాహన విశ్వవిద్యాలయానికి – 49 , పాలమూరు విశ్వవిద్యాలయానికి 45 పోస్టులు దక్కాయి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం-16, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 16, తెలంగాణ విశ్వవిద్యాలయానికి రెండు పోస్టుల భర్తీకి అనుమతించారు.
ఈ నిర్ణయంతో అధ్యాపక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ అనుమతి అనంతరం విశ్వవిద్యాలయాలు విడివిడిగా నియామక ప్రకటనలు విడుదల చేయాల్సి ఉంటుంది.
* కేయూలో విభాగాలవారీగా ఇలా ఉన్నాయి ..
కాకతీయ విశ్వవిద్యాలయంలో జువాలజీకి అత్యధికంగా ఆరు పోస్టులు కేటాయించారు. కామర్స్, ఇంగ్లిష్లో ఐదేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్, లా, తెలుగులో మూడేసి పోస్టులు ఉన్నాయి.
బాటనీ, కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎంబీఏలో రెండేసి పోస్టులు కేటాయించారు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, హిస్టరీ, లైబ్రరీ సైన్స్, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, సోషియాలజీ, ఉర్దూ, ఫార్మసీలో ఒక్కో పోస్టు చొప్పున భర్తీ చేయనున్నారు.
* మొదట రోస్టర్.. తర్వాత దరఖాస్తులు..
విభాగాలవారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్లను రూపొందించి, సంబంధిత సంక్షేమ శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. అనంతరం విశ్వవిద్యాలయాలు నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. దరఖాస్తు తేదీలు, ఫీజు, విద్యార్హతలు, రిజర్వేషన్ వర్గాలు, ఎంపిక విధానం వంటి వివరాలు ఆయా ప్రకటనల్లో వెల్లడిస్తారు.
రోస్టర్ ఖరారు తదితర ప్రక్రియలకు సుమారు నెలరోజుల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2 నాటికి నియామక పత్రాలు అందించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అధికారిక నియామక షెడ్యూల్ వెలువడిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది.
* విద్యార్హతలతోపాటు బోధనకూ పరీక్ష..
అభ్యర్థుల విద్యార్హతలు, పరిశోధన పత్రాలు, అనుభవంతోపాటు ఇంటర్వ్యూ, బోధనా ప్రదర్శనకు కూడా ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. సబ్జెక్టుపై పట్టు, విషయాన్ని విద్యార్థులకు వివరించే తీరు, భావవ్యక్తీకరణ, బోధనా నైపుణ్యాలను పరిశీలించనున్నారు.
నెట్, సెట్, పీహెచ్డీ అర్హతల వర్తింపు, పరిశోధన అనుభవానికి వెయిటేజీ, మార్కుల కేటాయింపు వంటి అంశాల్లో అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించే నిబంధనలే ప్రామాణికం కానున్నాయి.
* ఇతర అధ్యాపక ఖాళీలపై ఎదురుచూపులు..
ప్రస్తుత అనుమతి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకే పరిమితమైంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి ఈ విడతలో అనుమతి ఇవ్వలేదని కొత్త కథనం పేర్కొంది. విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చేందుకు మిగిలిన అధ్యాపక ఖాళీల భర్తీపైనా నిర్ణయం అవసరం.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అనుమతించిన 49 పోస్టుల నియామకాలు పూర్తయితే పలు విభాగాల్లో తరగతుల నిర్వహణ, పరిశోధన పర్యవేక్షణ, ప్రయోగశాలల కార్యకలాపాలకు బలం చేకూరనుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

