Rebbena Police
* 5.232 కిలోల గంజాయి స్వాధీనం
* రెండు ఫోన్లు, స్కూటీ సీజ్
ఆకేరు న్యూస్, ఆసిఫాబాద్: ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై దంపతులను రెబ్బెన పోలీసులు అరెస్ట్ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో వారి నుంచి 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు సెల్ఫోన్లు, ఒక స్కూటీని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు.
రూ.15 వేలకు గంజాయి కొనుగోలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్గాంకు చెందిన జుముర్ గెయిన్ (33), ఆమె భర్త సురంజన్ గెయిన్ (46) ప్రస్తుతం కాగజ్‌నగర్‌లో నివసిస్తున్నారు. సురంజన్ ఎస్పీఎం సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 14న జుముర్ ఒడిశాకు వెళ్లి పింటూ అనే వ్యక్తి వద్ద రూ.15 వేలకు గంజాయి కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
గంజాయితో తిరిగి వస్తున్న భార్యను తీసుకెళ్లేందుకు సురంజన్ స్కూటీతో వేచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద గంజాయి లభించడంతో అరెస్ట్ చేసి, రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మరో నలుగురి పాత్రపై విచారణ
ఈ కేసులో ఒడిశాకు చెందిన పింటూతో పాటు మంచిర్యాలకు చెందిన మున్నీ, జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్, రాజు పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? ఈ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
గంజాయి రవాణాను గుర్తించి నిందితులను పట్టుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్, వాంకిడి ఇన్చార్జి సీఐ వేణుగోపాల్, రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ నితికా పంత్ అభినందించారు. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

