UPSC Exam Rules
* ఆ చిన్న తప్పులు చేస్తే లైఫ్‌లాంగ్ బ్యాన్ తప్పదు..
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమించే అభ్యర్థులు ఒక చిన్న పొరపాటు చేసినా వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పోటీ పరీక్షల దరఖాస్తుల నుంచి పరీక్షా హాల్, తుది ఎంపిక వరకు అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరియు సిబ్బంది శిక్షణ శాఖ (DoPT) మార్గదర్శకాల ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టమవుతోంది.
* దరఖాస్తులో తప్పుడు సమాచారం (Lifelong Ban)..
పోటీ పరీక్షల (UPSC, APPSC/TSPSC లేదా ఇతర రిక్రూట్మెంట్లు) ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. దరఖాస్తులో కావాలని తప్పుడు సమాచారం ఇవ్వడం, లేదా నకిలీ కుల, ఆదాయ, విద్యార్హత సర్టిఫికెట్లను సమర్పిస్తే యూపీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేస్తారు. అంతేకాకుండా, సదరు అభ్యర్థి భవిష్యత్తులో ఏ పోటీ పరీక్ష రాయకుండా శాశ్వత నిషేధం (Lifelong Debarment) విధించే తీవ్రమైన అవకాశాలు ఉన్నాయి.
* పరీక్షా హాల్లో నిబంధనల ఉల్లంఘన..
పరీక్షా కేంద్రాల్లో (Exam Hall) ఆంక్షలను ఉల్లంఘిస్తే కేవలం పరీక్ష నుంచి డిబార్ చేయడంతో సరిపెట్టరు. పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు లేదా ఇతర నిషేధిత ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తే కఠిన చర్యలు ఉంటాయి. నిబంధనలను ధిక్కరిస్తే పరీక్ష రద్దు చేయడమే కాకుండా, అభ్యర్థిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (Criminal Case) నమోదు చేసే అవకాశం ఉంది.
* మోసంతో ఉద్యోగం పొందితే..
ఒకవేళ తప్పుడు పత్రాలు లేదా తప్పుడు సమాచారంతో ఎలాగైనా ఉద్యోగం సాధించినప్పటికీ, భవిష్యత్తులో విచారణలో ఆ విషయం బయటపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మార్గదర్శకాల ప్రకారం.. మోసపూరిత మార్గాల్లో ఉద్యోగం పొందినట్లు తేలితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సర్వీసు నుంచి తక్షణమే తొలగించడంతో (Termination) పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు.
* అభ్యర్థులకు సూచన..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసితో కష్టపడే ప్రతి ఒక్కరూ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. దరఖాస్తు చేసేటప్పుడు ప్రతీ వివరాని సరిగ్గా చెక్ చేసుకోవడం, హాల్ టికెట్ నిబంధనలను కచ్చితంగా ఫాలో కావడం ఎంతో ముఖ్యం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

