Harley Davidson Sprint 440 Launch
* హార్లీ డేవిడ్సన్ ‘స్ప్రింట్ 440’ ఆవిష్కరణ
* హీరో మోటోకార్ప్‌తో కలిసి అభివృద్ధి
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ సరికొత్త క్రూజర్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. ‘2027 స్ప్రింట్ 440’ పేరుతో రూపొందించిన ఈ బైక్‌ను హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన క్రూజర్ డిజైన్, తక్కువ సీటు ఎత్తు, ఆధునిక ఫీచర్లు దీని ప్రత్యేకతలు. 440 సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్.. కొత్తగా రైడింగ్ ప్రారంభించేవారితో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునేవారిని లక్ష్యంగా చేసుకుంది.
* 440 సీసీ ఇంజిన్.. 38 ఎన్ఎం టార్క్
స్ప్రింట్ 440లో 440 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6,000 ఆర్పీఎం వద్ద సుమారు 27 బీహెచ్పీ శక్తిని, 4,000 ఆర్పీఎం వద్ద 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అందించారు. ముఖ్యంగా ఐదు, ఆరో గేర్లు హైవే ప్రయాణాల్లో సౌకర్యవంతమైన రైడింగ్‌కు ఉపయోగపడేలా రూపొందించారు.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ బైక్ లీటరుకు సుమారు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 9 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.
* తక్కువ సీటు ఎత్తు.. ఆకర్షణీయమైన క్రూజర్ డిజైన్
స్ప్రింట్ 440లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం 671 మిల్లీమీటర్ల సీటు ఎత్తు. దీంతో తక్కువ ఎత్తు ఉన్నవారికి కూడా బైక్‌పై కూర్చోవడం, కాళ్లు నేలకు ఆనించడం సులభంగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 187 కిలోలు. డిజైన్ విషయానికొస్తే.. టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వెనక్కి వంగిన హ్యాండిల్‌బార్, స్టెప్డ్ సీటు, లో-మౌంటెడ్ ఎగ్జాస్ట్ క్రూజర్ రూపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డార్క్ బిలియర్డ్ గ్రే, వివిడ్ బ్లాక్, టీల్ థండర్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులోకి రానుంది.
* టీఎఫ్టీ డిస్ప్లే.. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్
ఫీచర్ల పరంగా కూడా స్ప్రింట్ 440లో ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. గుండ్రటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 3.5 అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లేను అమర్చారు. పూర్తి ఎల్ఈడీ లైటింగ్‌తో పాటు యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టును అందించారు. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 43 మిల్లీమీటర్ల అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక ఏడు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే ట్విన్ షాక్ అబ్జార్బర్లను ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ కోసం ముందు 320 మిల్లీమీటర్లు, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులు ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంది. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 147 మిల్లీమీటర్లుగా పేర్కొన్నారు.
* ధర ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ బైక్ ధరను కూడా ప్రకటించినట్లు సమాచారం. యూకేలో ప్రారంభ ధర 4,995 పౌండ్లుగా, అమెరికాలో సుమారు 6,000 డాలర్లుగా ఉండనుంది. అమెరికాలో 2027లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అక్కడి పెన్సిల్వేనియాలోని యార్క్ ప్లాంట్‌లో తుది అసెంబ్లీ చేపట్టనున్నారు.
భారత్‌లో స్ప్రింట్ 440 ధర సుమారు రూ.3.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే దేశీయ మార్కెట్లో విడుదల తేదీ, అధికారిక ధరపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 2027 నుంచి వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

