చిర్ర సూరి
* అమరవీరుల ఆశయ సాధనకు పిలుపు
* చిర్ర సూరి పిలుపు
ఆకేరు న్యూస్, రాయపర్తి: అమరవీరులు ఆశించిన ఆశయాల సాధన కోసం వారి ప్రాణత్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య, విముక్తి పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చిర్ర సూరి పిలుపునిచ్చారు.
నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ సభల వారోత్సవాల్లో భాగంగా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గబ్బీటా దేవేందర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చిర్ర సూరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరల చట్టం కోసం రైతులు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అండగా నిలవాలని కోరారు.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన పాలకులే వాటికి విఘాతం కలిగిస్తున్నారని చిర్ర సూరి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 13 కోట్ల 45 లక్షల ఓట్లను తొలగిస్తోందని ఆరోపిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.
తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
భారత విప్లవోద్యమ చరిత్రలో వందలాది, వేలాది మంది యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంజీవ, వెంకన్న, మురళి, మల్లయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

