సుప్రీంకోర్టు
* కేరళ కాంగ్రెస్ నేతలకు నోటీసులు
* న్యాయవ్యవస్థను బెదిరిస్తే సహించం
* సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
ఆకేరు న్యూస్, డెస్క్: రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ఏ వ్యక్తి లేదా రాజకీయ సంస్థ రాజ్యాంగం కంటే గొప్పది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేసిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నేతలకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది రాజకీయ సౌలభ్యానికి సంబంధించిన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీర్పులను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థను భయపెట్టడానికి లేదా న్యాయపాలనకు ఆటంకం కలిగించడానికి భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
సీజేఐ సూర్యకాంత్‌ను ఉద్దేశించి కేరళ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో గత అక్టోబర్ 12న వివాదాస్పద పోస్టు ప్రచురితమైంది. చట్ట, శాంతిభద్రతల అంశం మీ పరిధిలో లేకపోతే రాజీనామా చేయాలని, మీ స్థానంలో మరొకరిని తీసుకొస్తామని ఆ పోస్టులో పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టును తొలగించారు. అయితే పార్టీ నాయకత్వానికి తెలియకుండా ఈ పోస్టు ప్రచురితమైందని, బాధ్యుడైన వ్యక్తిని బాధ్యతల నుంచి తొలగించామని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ గతంలో వివరణ ఇచ్చారు. బేషరతుగా క్షమాపణ కూడా తెలిపినట్లు పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రీంకోర్టు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సహా కార్యవర్గ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సహాయం కూడా కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో కోర్టు తుది నిర్ణయం వెలువరించలేదు. సంబంధిత పోస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలించనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

