మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్
* చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ అనుబంధాలతో చిల్డ్రన్ మూవీ
* నవంబర్ 6న థియేటర్లలో విడుదల
Summer Holidays| ఆకేరు న్యూస్, సినిమా: చిన్ననాటి జ్ఞాపకాలు, పిల్లల అల్లరి, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదల సందర్భంగా నటులు రోహన్, అరుణ్ ఓ ఇంటర్వ్యూలో తమ పాత్రలు, షూటింగ్ అనుభవాలు, సినిమా విశేషాలను పంచుకున్నారు.
అమ్మ ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు: అరుణ్
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నానని, సినిమాలో ఆర్.వి. అనే ప్రశాంతమైన కుర్రాడి పాత్రలో కనిపిస్తానని అరుణ్ తెలిపారు. కె.వి.తో పరిచయం ఏర్పడిన తర్వాత తన పాత్ర జీవితంలో చోటుచేసుకునే మార్పులు ఆసక్తికరంగా ఉంటాయని చెప్పారు. సీనియర్ నటి జయసుధతో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చిందని, ఆమె ఇచ్చిన సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
తనకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు రావడానికి తల్లి ప్రోత్సాహమే కారణమని అరుణ్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో తల్లి ఎంతో అండగా నిలిచారని తెలిపారు. సినిమాలోని స్కూల్ సాంగ్ చిత్రీకరణను బాగా ఎంజాయ్ చేశామని, సంగీత దర్శకుడు సింజిత్ మంచి సంగీతం అందించారని చెప్పారు.
చదువే తొలి ప్రాధాన్యత: రోహన్
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న రోహన్.. సినిమాలో కె.వి. పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా అందరితో సరదాగా మాట్లాడే ఎనర్జిటిక్ కుర్రాడిగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కుటుంబం, తల్లి కోసం కష్టపడే వ్యక్తిగా కనిపిస్తానన్నారు.
చదువుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని, షూటింగ్స్ కారణంగా తరగతులు మిస్ కాకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. పరీక్షల్లో 80 నుంచి 90 శాతం మార్కులు సాధిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో చేసిన ‘90’s’లో తెలంగాణ యాసలో మాట్లాడితే, ‘సమ్మర్ హాలిడేస్’లో గోదావరి యాసలో మాట్లాడినట్లు చెప్పారు. ‘ప్రీ వెడ్డింగ్ షో’తో పాటు విభిన్నమైన పాత్రలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఎమోషనల్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ
కామెడీ కంటే ఎమోషనల్ సన్నివేశాల్లో నటించడం తనకు ఎక్కువ ఇష్టమని రోహన్ తెలిపారు. ‘సమ్మర్ హాలిడేస్’లో కామెడీతో పాటు భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యత ఉందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని చెప్పారు.
దర్శకుడు శ్రీకర్ ఎంతో నమ్మకంతో సినిమాను తెరకెక్కించారని, నిర్మాత ధీరజ్ మొగిలినేని సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి, అంకితభావం చూపించారని ప్రశంసించారు.
ఫన్, ఎమోషన్స్, చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ అనుబంధాలతో రూపొందిన ‘సమ్మర్ హాలిడేస్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

