Rahul Gandhi
* పెట్రోల్‌లో ఇథనాల్ కల్తీ
* కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలో పెట్రోల్ నాణ్యతపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో పెట్రోల్ విక్రయాల్లో ఇథనాల్ మోతాదు నిర్ణీత పరిమితిని మించుతోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాల్సి ఉండగా, కొన్ని కంపెనీలు 30 శాతానికి పైగా కలుపుతున్నాయని ల్యాబ్ నివేదికలను ఉటంకిస్తూ విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
* 14 శాంపిల్స్‌లో 11 చోట్ల అధిక మోతాదు
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 14 పెట్రోల్ శాంపిల్స్‌ను పరీక్షించగా, వాటిలో 11 చోట్ల నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. 20 శాతం ఇథనాల్ కలపాల్సిన చోట 30 శాతానికి పైగా కలుపుతున్నారనే ఆరోపణలు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
* వాహనదారులపై అదనపు భారం
పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదు అధికంగా ఉండటం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య వాహనదారులపై ఈ పరిణామం మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని విమర్శించారు.
* ఆయిల్ కంపెనీల ఖండన..
మరోవైపు, పెట్రోల్‌లో ఇథనాల్ కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను ఆయిల్ కంపెనీలు తిరస్కరించాయి. ఈ ఆరోపణలపై ప్రకటన విడుదల చేస్తూ తమ వాదనను వెల్లడించాయి. పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆయిల్ కంపెనీల ఖండనతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల ప్రయోజనాలు, ఇంధన నాణ్యతపై స్పష్టత రావాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

