ECI voter list
* ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు ఊరట
* తొలగించిన ఓట్లకు మళ్లీ అవకాశం
* ఈసీ కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, డెస్క్: ఓటర్ల జాబితాలో పేరు తొలగిపోయిందా? ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కని కొందరు ఓటర్లు తిరిగి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం గతంలో మాదిరిగా కొత్తగా ఫారం-6 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
* ఫారం-6 లేకుండానే మళ్లీ అవకాశం
సాధారణంగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి ఫారం-6 సమర్పించాల్సి ఉంటుంది. అయితే SIR ప్రక్రియలో గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ నమోదు వంటి ASDD కారణాలతో ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు మళ్లీ అవకాశం పొందవచ్చు. ఇందుకోసం ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఈసీ నిర్దేశించిన డిక్లరేషన్ అనుబంధ పత్రాన్ని సమర్పించాలి. ఫారం-6, ఫారం-8 సమర్పించాల్సిన అవసరం ఉండదని ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది.
* చిరునామా మారిన వారికి ప్రత్యేక వెసులుబాటు
ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కొత్త చిరునామాతో ఎన్యుమరేషన్ ఫారం, అవసరమైన అనుబంధ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి ఈ పత్రాలు అందజేయవచ్చు.
* బీఎల్ఓల ద్వారా పత్రాల సేకరణ
అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి అవకాశం కల్పించేందుకు బూత్ స్థాయి అధికారులు (BLOలు) క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలు, డిక్లరేషన్ పత్రాల సమర్పణకు సహకరించనున్నారు. ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు.
* ఏడు రాష్ట్రాల్లో అమలు
ఈసీ కల్పించిన తాజా వెసులుబాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. ఈ రాష్ట్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులకు మరో అవకాశం లభించనుంది.
* ఏపీలో 44.89 లక్షల ఓట్లు తొలగింపు
ఆంధ్రప్రదేశ్లో SIR ప్రక్రియలో భాగంగా మొత్తం 44,89,512 మంది ఓటర్లను ASDD కేటగిరీలో గుర్తించారు. వీరిలో చిరునామాలో లేని వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించిన వారు ఉన్నారు. ఇతర సాంకేతిక కారణాలతో నమోదైన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
తొలగింపు వివరాలను పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో పరిశీలించవచ్చు. అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CEO Andhra) అధికారిక వెబ్సైట్లోనూ సంబంధిత జాబితాలు అందుబాటులో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, అర్హత ఉన్నప్పటికీ పేరు తొలగిపోయిన వారు ఎన్నికల సంఘం సూచించిన విధానంలో తిరిగి నమోదు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

