నకిలీ వైద్యుడు సుధాకర్ తో తెలంగాణా మెడికల్ కౌన్సిల్ అధికారులు
* అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు
* ఆధారాల సేకరణ.. క్రిమినల్ కేసు నమోదుకు చర్యలు
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామంలో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్నారనే ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) సభ్యులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వైద్య కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న వైద్య సేవలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.
ఫిర్యాదు ప్రకారం.. మాచర్ల సుధాకర్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్లో విద్యాభ్యాసం నిలిపివేసి, ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య విద్యార్హత లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. Clinical Establishments Act (CEA) ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఆసుపత్రి తరహాలో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించారు.
రోగులకు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మందులు (Pain Killers) వినియోగిస్తున్నట్లు గుర్తించిన అంశాలను TGMC తీవ్రంగా పరిగణించింది.
ఈ తనిఖీల్లో TGMC సభ్యుడు డాక్టర్ వి. నరేష్ కుమార్, కో-ఆప్ట్ సభ్యుడు డాక్టర్ కె. వెంకటస్వామి పాల్గొన్నారు. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహించడం, అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాన్ని నడపడం వంటి ఉల్లంఘనలపై సేకరించిన ఆధారాలను పరిశీలించి, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం (TMPR Act) సెక్షన్ 22 ప్రకారం సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు TGMC చర్యలు చేపడుతోంది.

* నకిలీ వైద్యంపై TGMC హెచ్చరిక
ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నకిలీ వైద్యంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TGMC సూచించింది. వైద్య విద్యార్హతలు, సరైన శిక్షణ, వ్యాధి నిర్ధారణ పరిజ్ఞానం లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవడం వల్ల రోగుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలగవచ్చని పేర్కొంది.
* స్టెరాయిడ్స్ దుర్వినియోగంతో..
– రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం తీవ్రతరం కావచ్చు.
– రక్తపోటు పెరగడం, శరీరంలో నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలు రావచ్చు.
– రోగనిరోధక శక్తి తగ్గి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
– ఎముకలు బలహీనపడటం, కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది.
* యాంటీబయాటిక్స్ దుర్వినియోగంతో..
– అవసరం లేకుండా వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉంది.
– భవిష్యత్‌లో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పనిచేయకపోవచ్చు.
– తీవ్రమైన అలర్జీలు, కిడ్నీ, కాలేయ సమస్యలు రావచ్చు.
– సరైన మందు, మోతాదు, వ్యవధి పాటించకపోతే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోవచ్చు.
* నొప్పి నివారణ మందుల దుర్వినియోగంతో..
– కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
– గ్యాస్ట్రిక్ అల్సర్లు, కడుపులో రక్తస్రావం జరగవచ్చు.
– రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఉంటుంది.
– అధిక మోతాదులో లేదా ఇతర మందులతో కలిపి వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలు కలగవచ్చు.
* నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులు, అనధికార వైద్య కేంద్రాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొంది. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేయడం, అనుమతులు లేకుండా వైద్య కేంద్రాలు నిర్వహించడం, విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని TGMC హెచ్చరించింది.
* ప్రజలకు TGMC సూచనలు
– వైద్యం చేయించుకునే ముందు వైద్యుని గుర్తింపు పొందిన వైద్య విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
– కేవలం RMP, డాక్టర్, క్లినిక్ వంటి బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన వారు అర్హత కలిగిన వైద్యులు కాదని గుర్తించాలి.
– రిజిస్టర్డ్ వైద్యుని సలహా లేకుండా ఇంజెక్షన్లు, సెలైన్లు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తీసుకోవద్దు.
– తక్షణ ఉపశమనం కోసం అధిక మోతాదులో మందులు ఇచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
– దీర్ఘకాలిక వ్యాధులకు అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందాలి.
* నకిలీ వైద్యులపై ఫిర్యాదు చేయండి
నకిలీ వైద్యులు, అర్హత లేని వ్యక్తులు అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తిస్తే ప్రజలు నిర్భయంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని TGMC కోరింది.
ఫిర్యాదుల కోసం WhatsApp: 9154382727
నకిలీ వైద్యుల పేరు, గ్రామం, వైద్య కేంద్రం వివరాలతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను WhatsApp ద్వారా తెలియజేయాలని సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణ మా బాధ్యత- నకిలీ వైద్యుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడం మా సంకల్పం అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

