సీపీ అంబర్ కిశోర్ ఝా
* రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
ఆకేరు న్యూస్, గోదావరిఖని: విద్యార్థులు ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, పరస్పర గౌరవం, మానవతా విలువలను అలవర్చుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచే పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు.
గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)లో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి సంబంధించిన చట్టాలు, శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
సీనియర్లు మార్గదర్శకులుగా ఉండాలి
సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహకరిస్తూ మార్గదర్శకులుగా నిలవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్ సూచించారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించడం, భయపెట్టడం, అవమానించడం వంటి చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. కళాశాలలో ప్రతి విద్యార్థి భయం లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని అన్నారు.
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు
ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందితోపాటు విద్యార్థులందరిపై ఉందని సీపీ పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. విద్యార్థి దశలో ఏర్పడే స్నేహాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు.
తాను ఎన్ఐటీ తిరుచ్చిలో చదువుకున్న సమయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ హెడ్‌గా పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా సీపీ గుర్తుచేశారు. విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో ర్యాగింగ్‌కు తావులేని వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగామని తెలిపారు.
డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం
మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు పెను ప్రమాదమని సీపీ హెచ్చరించారు. ఒక్కసారి డ్రగ్స్‌కు బానిసైతే వాటి నుంచి బయటపడటం కష్టమని, దాని ప్రభావం వ్యక్తితోపాటు కుటుంబంపై కూడా పడుతుందని వివరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించి చట్టంలో కఠినమైన నిబంధనలు, శిక్షలు ఉన్నాయని గుర్తుచేశారు.
విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా తమ స్నేహితులు, తోటి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, చదువు, కుటుంబ సంబంధాలు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
కళాశాలల్లో నిరంతర తనిఖీలు
కళాశాల యాజమాన్యాలు యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా హాస్టళ్లు, కళాశాల ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని సీపీ సూచించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాకు అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.
కొద్దిమంది విద్యార్థుల తప్పిదాల వల్ల మొత్తం కళాశాల ప్రతిష్ఠ దెబ్బతినకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి నైపుణ్యం కలిగిన వైద్యులుగా ఎదగడంతోపాటు పేదలు, బలహీన వర్గాలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, ప్రిన్సిపాల్ దయాల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ ఎస్ఐ రమేశ్, ఆర్ఎస్ఐ ప్రవీణ్, వన్‌టౌన్ ఎస్ఐలు మనోహర్, రాజశేఖర్, వార్డెన్ డాక్టర్ ఓబులేష్, ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు, పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

