Cyber Crime
* రూ.33.62 లక్షలు స్వాహా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న కొత్త తరహా మోసాలు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా బాచుపల్లికి చెందిన రూపేష్ కుమార్ పెర్లా అనే ఉద్యోగి ఫేస్బుక్లో కనిపించిన ఓ ఆకర్షణీయమైన ట్రేడింగ్ ప్రకటనను నమ్మి ఘోరంగా మోసపోయాడు. ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో ప్రవేశపెట్టిన కేటుగాళ్లు, ప్రముఖ ‘ఈక్విరస్’ సంస్థ పేరుతో ఒక నకిలీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేయించి భారీ పెట్టుబడులకు తెరలేపారు.
రూ.1.44 కోట్ల భారీ లాభం..
ఈ మోసంలో భాగంగా తొలుత తక్కువ పెట్టుబడులపై స్వల్ప లాభాలు చూపించి బాధితుడిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఐపీఓలు, డిస్కౌంట్ ట్రేడింగ్ అంటూ అతడితో విడతల వారీగా రూ.33.62 లక్షలు జమ చేయించుకున్నారు. కొద్దిరోజులకే సదరు నకిలీ యాప్లో రూ.1.44 కోట్ల భారీ లాభం వచ్చినట్లు నమ్మించి, ఆ డబ్బును నిజంగానే విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని బాధితుడికి నమ్మకం కలిగేలా వ్యవహరించారు.
రూ.21.62 లక్షలు చెల్లించినప్పటికీ ..
అయితే, ఆ లాభాలను విత్డ్రా చేసుకోవాలంటే ముందుగా 15 శాతం కమీషన్, ఆ తర్వాత 20 శాతం పన్ను చెల్లించాలంటూ కేటుగాళ్లు అదనపు మొత్తాల కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వారు అడిగిన విధంగా బాధితుడు రూ.21.62 లక్షలు చెల్లించినప్పటికీ నగడను పొందలేకపోయాడు. చివరకు నవంబర్ 6న మరింత మొత్తాన్ని డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

