Secunderabad Railway Police
* ప్రయాణికుడి బంగారం చోరీ చేసిన నిందితుడు అరెస్ట్
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రైళ్లలో దుప్పట్లు సర్దే బెడ్ రోలర్ బాగోతం వెలుగు చూసింది. భువనగిరి జిల్లా యాదాద్రి అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లపల్లి సాయిరాం అలియాస్ సాయి (26) చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ బోగిలో బెడ్ రోలర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 9న తెల్లవారుజామున చర్లపల్లి రైల్వే స్టేషన్లో రైలు ఆగగా, బోగిలో దుప్పట్లు సేకరిస్తున్న సమయంలో 39వ నెంబరు బెర్తు దిండు కింద 40 గ్రాముల బంగారు గొలుసు అతనికి లభించింది. ఆ గొలుసును కాజేసి ఇంటికి వెళ్లిపోయిన సాయి, దానిని విక్రయించేందుకు ఈనెల 11న సికింద్రాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు.
40 గ్రాముల బంగారం చోరీ
ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో అనుమానాస్పద స్థితిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరుగుతున్న సాయిని జీఆర్పి, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను అసలు నిజం ఒప్పుకోవడంతో, నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే డిఎస్పి జావీద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ బుధవారం జీఆర్పి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
మరో కేసులో అంతర్రాష్ట్ర నిందితులు..
ఇదిలా ఉండగా, రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కూడా సికింద్రాబాద్ జీఆర్పి పోలీసులు అరెస్టు చేశారు. తుకారాంగేట్ బోయబస్తీకి చెందిన గౌరి కిశోర్ శశాంత్ (30), మల్కాజిగిరి సత్తిరెడ్డి కాలనీకి చెందిన శ్రీరామ సాయి కుమార్ అలియాస్ సైకో సాయి అలియాస్ స్మోకర్ సాయి (26), దబిల్పూర ప్రాంతానికి చెందిన కేఆర్ ముత్యాలు అలియాస్ కరోల ముత్యాలు (25)లు మంచి స్నేహితులు. గతంలోనూ వివిధ నేరాల్లో జైలుకెళ్లిన వీరు, తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నెమ్మదిగా వెళ్లే రైళ్లను, ప్రయాణికులను టార్గెట్ చేస్తూ వచ్చారు.
బంగారాన్ని ముద్దగా చేసి..
ఈ ముగ్గురు నిందితులు ప్రయాణికుల సెల్ఫోన్లు, మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు కాజేసి, ఆ నగలన్నింటినీ కలిపి ముద్దగా చేసి కరిగించి విలాసాలకు ఖర్చు చేసేవారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులను బెదిరించి యూపీఐ ద్వారా కూడా నగదు బదిలీ చేయించుకున్నారు. ఈనెల 11న తనిఖీల సమయంలో పోలీసులకు పట్టుబడిన ఈ ముగ్గురి నుంచి రూ. 2.88 లక్షల విలువ చేసే 19 గ్రాముల బంగారు ముద్దలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

