Mumbai Bomb Threat Emails
* అమితాబ్ ఇంటికీ వార్నింగ్
* దిల్జీత్ కచేరీ టార్గెట్
* రంగంలోకి దిగిన పోలీసులు
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. నగర మేయర్ కార్యాలయం, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నివాసం, ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ కచేరీ వేదికను లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో ముంబై పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముంబై మేయర్ రీతూ తావ్డే కార్యాలయానికి వచ్చిన ఈ-మెయిల్లో కార్యాలయాన్ని పేల్చివేస్తామని హెచ్చరించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఇదే సందేశంలో అమితాబ్ బచ్చన్ నివసించే జుహూలోని ‘జల్సా’ భవనాన్ని, నవంబర్ 27న మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరగనున్న దిల్జీత్ దోసాంజ్ కచేరీని కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
ఈ బెదిరింపుల్లో పాఠశాలలపై దాడుల ప్రస్తావన కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. బెదిరింపు సందేశం అందుకున్న వెంటనే పోలీసులు మేయర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులేవీ గుర్తించలేదని అధికారులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ-మెయిల్ మూలాలను గుర్తించే పనిలో ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా కీలక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సున్నితమైన ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు. ఇటీవలి రోజుల్లో ముంబైలోని ప్రముఖ సంస్థలు, వ్యక్తులు, కార్యక్రమాలకు వరుసగా బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే బెదిరింపు సందేశాలు వచ్చినంత మాత్రాన దాడి జరిగిందని భావించరాదని, వాటి విశ్వసనీయతపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

