తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (ఫైల్)
* డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన
* ఆన్లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండండి
* పోలీసు సిబ్బందికి డీజీపీ సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు కానిస్టేబుళ్లు ఆన్లైన్ గేమింగ్ యాప్‌లకు (Online Gaming Apps) బానిసలుగా మారి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని తెలంగాణ డీజీపీ (Telangana DGP) సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గేమింగ్ వ్యసనం (Gaming Addiction) కారణంగా అప్పులపాలై, ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిలో ఇలాంటి సమస్యలను గుర్తించి, వారిని వ్యసనాల నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
* వరంగల్ దంపతుల ఘటనపై డీజీపీ విచారం..
మరోవైపు వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై డీజీపీ (Telangana DGP) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేక, వారానికి రూ.750 వాయిదా కూడా కట్టలేని పరిస్థితి రావడం, అప్పు ఇచ్చిన వారి నుంచి అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అప్పుల ఒత్తిడి (Debt Pressure) కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
* పోలీసు సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..
ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting), గేమింగ్ యాప్‌లు, మద్యం, మాదకద్రవ్యాలు తదితర వ్యసనాలకు దూరంగా ఉండాలని డీజీపీ గతంలోనూ పోలీసు సిబ్బందికి సూచించారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించాలని, అవసరమైతే ఉన్నతాధికారుల సహాయం తీసుకోవాలని కోరారు.
2026 సెప్టెంబర్‌లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కూడా పోలీసు సిబ్బందికి డీజీపీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకుని గత నాలుగు నెలల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో వెల్లడించారు. సమస్యలను దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులకు, అధికారులకు తెలియజేయాలని సూచించారు.
* కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి..
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని డీజీపీ సూచించారు. సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అధికారుల సహాయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గేమింగ్, బెట్టింగ్ వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలని పోలీసు సిబ్బందికి హితవు పలికారు.
Also Read : 22న ప్రత్యేక పల్స్ పోలియో..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

