రెస్టారెంట్లలో తనిఖీలు
* 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్
* హోటళ్లలో అపరిశుభ్రత.. రెండు సంస్థలు మూసివేత
* వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు..
* హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్స్ (TG SAFE Hyderabad Raids) అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నవంబర్ 18న చేపట్టిన ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
వంటగదుల్లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, నిల్వ నీరు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వంటి లోపాలను గుర్తించారు. దీంతో నాలుగు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI License) లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు మరో రెండు సంస్థలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు.
* నాలుగు రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్..
తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనల ఆధారంగా నాలుగు సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వాటిలో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ అండ్ స్టోర్స్ లాడ్జ్, వెంకట్రావు నగర్‌లోని పాండెం కోడి రెస్టారెంట్, జూబ్లీహిల్స్‌లోని లాహం హౌస్, గౌలిదొడ్డిలోని స్పైస్ కిచెన్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ సంస్థలు తక్షణమే తమ కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
* లైసెన్సులు లేకపోవడంతో రెండు సంస్థల మూసివేత..
కూకట్‌పల్లిలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలో ఉన్న న్యూ బ్లూ స్టార్ రెస్టారెంట్, పంజాగుట్టలోని శ్రీనివాస బాయ్స్ హాస్టల్ సరైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (Food Safety License) లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సంస్థలను మూసివేయాలని ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా పలు రెస్టారెంట్ల వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు కనిపించాయి. కొన్ని చోట్ల డ్రైనేజీలు ఆహార వ్యర్థాలతో నిండిపోయి ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ముడి పదార్థాలు, వండిన ఆహారాన్ని వేర్వేరుగా నిల్వ చేయకపోవడం, ఆహార పదార్థాలను వార్తాపత్రికల్లో చుట్టడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, తాగునీటి నాణ్యత పరీక్ష నివేదికలు వంటి తప్పనిసరి పత్రాలను నిర్వహించకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు.
* 300 కిలోల ఆహార పదార్థాల తొలగింపు..
ఈ తనిఖీల్లో కల్తీ అనుమానంతో మొత్తం ఎనిమిది ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. సుమారు 300 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, వినియోగానికి అనర్హమైన వాటిని పారవేశారు. మరో ఐదు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టాట్వా హోటల్‌కు గుర్తించిన లోపాలను సరిచేసుకోవాలని సూచిస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసు అందజేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల్లో (TG SAFE Hyderabad Raids) తిరిగి తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గుర్తించిన లోపాలను సరిచేయకపోతే జరిమానాలు విధించడంతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Also Read : 22న ప్రత్యేక పల్స్ పోలియో..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

